Andhrapradesh
Chandrababu : విధ్వంసమే జగన్ విధానం, సొంత చెల్లెళ్లే ఓటేయవద్దంటున్నారు- చంద్రబాబు
Chandrababu : ప్రధాని మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విధ్వంసమే జగన్ విధానంగా రాష్ట్రాన్ని కూల్చిన వ్యక్తి.. అని విమర్శించారు. జగన్‌కు ఓటేయవద్దని సొంత చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
Chandrababu : టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట బొప్పూడిలో ప్రజాగళం సభ (Prajagalam meeting)నిర్వహించాయి. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) మాట్లాడుతూ… ప్రధాని మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారన్నారు. ప్రధాని మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం చెబుతున్నానన్నారు. ఏపీలో గెలవబోయేది ఎన్డీఏ (NDA)కూటమి అన్నారు. కూటమికి ప్రధాని మోదీ అండ ఉందన్నారు.మోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారన్నారు. జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే అని చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి మా అజెండా అన్నారు. మోదీ ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి, మోదీ అంటే అభివృద్ధి, సంక్షేమం అన్నారు. వికసిత్ భారత్ దిశగా భారత్ దూసుకుపోతోందని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని దేశం అనేది మోదీ కల అన్న చంద్రబాబు… మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలన్నారు.
మూడు ముక్కలాటతో అమరావతి నాశనం
“సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి మోదీ(PM Modi). అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి.. మోదీ. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. మోదీ నినాదాలు. ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మోదీ. భారత్‌ను శక్తివంతమైన జాతిగా తయారు చేయడమే మోదీ లక్ష్యం. 2014లో మేం వచ్చాక 11 జాతీయ విద్యాసంస్థలను తెచ్చాం. కేంద్ర సాయంతో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశాం. పోలవరాన్ని జగన్ గోదారిలో కలిపేశారు. అన్ని ప్రాజెక్టులు నాశనమయ్యాయి. కోట్లలో దోపిడీకి పాల్పడ్డారు. ఐదేళ్లలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగింది. మోదీ చేతులు మీదుగా అమరావతి నిర్మాణం ప్రారంభించాం. మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ భ్రష్టు పట్టించారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్.. అన్ని రంగాల్లో దోచేశారు”- చంద్రబాబు
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ ప్రధాని మోదీ నినాదాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జెండాలు వేరైనా మూడు పార్టీల అజెండా ఒక్కటే అన్నారు. మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలన్నారు. ఏపీలో ఎన్డీఏదే విజయం అన్నారు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి అన్నారు. జగన్ కు ఓటు వేయవద్దని సొంత చెల్లెళ్లే చెబుతున్నారు. వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని జగన్ సొంత చెల్లెళ్లే ఆరోపించారని తెలిపారు.
సీఎం జగన్ సారా వ్యాపారి -పవన్ కల్యాణ్
ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇసుక పేరుతో వైసీపీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలయిక ఐదు కోట్ల ప్రజలకు ఆనందం అన్నారు. అమరావతి అండగా ప్రధాని మోదీ అన్నారు. సీఎం జగన్ ఒక సారా వ్యాపారి అని విమర్శించారు. ఏపీ రావాల్సిన పరిశ్రమలను వైసీపీ నేతలు తరిమేశారని ఆరోపించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.