Political
ఏపీలో మధ్యంతర ఎన్నికలు?: హింట్ ఇచ్చిన సాయిరెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.
విశాఖపట్నంలో ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన.. పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్‌తో కలిసి మాట్లాడారు. ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయనే సంకేతాలను ఇచ్చారు. ఢిల్లీ రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ లేకపోవడం, భాగస్వామ్య పక్షాలతో బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి రావడం వంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చనే అభిప్రాాలు వ్యక్తమౌతోన్నాయి.
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తరచూ బెంగళూరుకు వెళ్లివస్తోండటం సైతం మధ్యంతర ఎన్నికల వార్తలకు బలాన్ని ఇచ్చినట్టవుతోంది. అదే సమయంలో- రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి.. మధ్యంతర ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అయిదేళ్ల తరువాత ఎన్నికలు జరిగినా లేద మధ్యంతరం వచ్చినా తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన తేల్చి చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు