Success story
BSF woman sniper : బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్‌గా సుమన్ కుమారి- 56మంది పురుషుల మధ్యలో నారీ శక్తి!
బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్‌గా సుమన్ కుమారి (X @BSF_CSWT)
BSF first woman sniper : బీఎస్ఎఫ్కు చెందిన సుమన్ కుమారి రికార్డు సృష్టించారు. బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్‌గా నిలిచారు!
Suman Kumari : మహిళా స్నైపర్, సబ్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమారికి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) స్వాగతం పలికింది. ఇండోర్‌లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ స్ట్రాటజీస్ (సీఎస్ డబ్ల్యూటీ)లో ఎనిమిది వారాల స్నైపర్ కోర్సు పూర్తి చేసిన ఆమె.. బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్‌గా రికార్డు సృష్టించారు. కోర్సులో సుమన్ ‘ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ ‘ సాధించారు.
బీఎస్ఎఫ్లో నారీ శక్తి..
మొదటి ‘మహిళా స్నైపర్’కు స్వాగతం పలుకుతూ.. ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో బీఎస్ఎఫ్ ఓ పోస్ట్ చేసింది.”బీఎస్ఎఫ్ నిజంగా సమ్మిళిత శక్తిగా మారుతోంది. ప్రతిచోటా మహిళలు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా ఒక అడుగు పడింది. కఠినమైన శిక్షణ తరువాత, #BSF.. తన మొదటి మహిళా స్నైపర్ని పొందింది,” అని పోస్ట్‌లో పేర్కొంది బీఎస్ఎఫ్.
టైమ్స్ ఆఫ్ ఇండియా (టిఓఐ) నివేదిక ప్రకారం, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుమన్.. పంజాబ్‌లో ఒక ప్లాటూన్‌కు కమాండర్ గా ఉన్నారు. సరిహద్దు వెంబడి స్నైపర్ దాడుల ముప్పును గమనించిన తరువాత స్నైపర్ కోర్సు చేయాలని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ముల్లును ముల్లుతోనే తీయాలని నిశ్చయించుకున్న సుమన్.. కోర్సులో పాల్గొనడానికి తన ఉన్నతాధికారుల ఆమోదం పొందారు.
స్నైపర్ కోర్సులో 56 మంది పురుషుల్లో సుమన్ ఒక్కరే మహిళ కావడం విశేషం. కమాండో ట్రైనింగ్ తర్వాత ఈ కోర్సును అత్యంత కఠినమైన శిక్షణగా పరిగణిస్తారు.
BSF first woman sniper Suman kumari : సుమన్ సాధించిన విజయం ఇతర మహిళలకు స్ఫూర్తిదాయకమని సీఎస్‌డబ్ల్యూటీ ఐజీ భాస్కర్ సింగ్ రావత్ కొనియాడారు. 56 మంది పురుషుల్లో ఆమె ఒక్కరే మహిళ అని, ప్రతి పనిలోనూ ఆమె అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిందన్నారు. తాజా పరిణామాలతో మహిళలు ఈ కోర్సునుఎంచుకునేందుకు ముందుకొస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.’అసాధారణంగా’ రాణించి వారికి.. స్నైపర్ కోర్సులో ఆల్ఫా, బ్రావో గ్రేడింగ్ లభిస్తుందని, అయితే సుమన్ సాధించిన ‘ఇన్ స్ట్రక్టర్ గ్రేడ్’కు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షను తీసుకుంటారని రావత్ వివరించారు. ఈ గ్రేడ్ ఆమెకు స్నైపర్ ఇన్స్ట్రక్టర్గా పోస్టింగ్ పొందడానికి అర్హత కల్పిస్తుంది.
BSF latest news : పురుష ట్రైనీలు కూడా పనిచేయడం కష్టంగా భావించే ఈ స్నైపర్ కోర్సులో సుమన్ ఎలా రాణించారో ఆమె ఇన్స్ట్రక్టర్స్లో ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.
“స్నైపర్ కోర్సుకు చాలా శారీరక, మానసిక బలం అవసరం. స్నైపర్‌ను గుర్తించకుండానే శత్రువుకు దగ్గరయ్యేలా ఏకాగ్రతపై దృష్టి సారించి ఈ ఏడాది శిక్షణ విధానాన్ని పెంచాం. చాలా మంది మగ ట్రైనీలు ఈ శిక్షణను తట్టుకోవడం కష్టమని భావిస్తారు. కోర్సును కూడా ప్రయత్నించరు. కానీ సుమన్ కుమారి.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది,” అని ఇన్స్ట్రక్టర్ చెప్పారు.
“కోర్సు సమయంలో ఆమె చాలా విభాగాల్లో ముందంజలో ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఆమె కృషి, సంకల్పం, నేర్చుకోవాలనే తపన ఆమెను ప్రత్యేకంగా నిలిపాయి” అని ఇన్స్ట్రక్టర్ స్పష్టం చేశారు.
సుమన్ నేపథ్యం..
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని ఓ సామాన్య కుటుంబానికి చెందిన వారు.. బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్ సుమన్. ఆమె తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. సుమన్ 2021లో బీఎస్ఎఫ్లో చేరారు.