International

British Museum: ప్రపంచ ప్రఖ్యాత బ్రిటీష్ మ్యూజియంలో చోరి.. 1800కుపైగా పురాతన వస్తువులు కాజేసిన ఇంటి దొంగ

Published

on

లండన్‌, మార్చి 27: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్‌ మ్యూజియంలో దొంగలు పడ్డారు. దాదాపు 1,800 ఏళ్ల నాటి పురాతన వస్తువులను, ఖళాఖండాలను దొంగలు చోరీ చేశారు. అనంతరం గుట్టుగా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు యత్నించారు. ఆనక ఇంటి దొంగే ఈ చోరీకి యత్నించినట్లు తెలుసుకున్న మ్యూజియం నిర్వాహకులు ఖంగుతిన్నారు. వెంటనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మ్యూజియంలో సంరక్షణాధికారిగా ఉన్న పీటర్‌ హిగ్స్‌ వాటిని అపహరించి ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. 2023 జులైలోనే మ్యూజియంలోని 1800కుపైగా వస్తువులు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పీటర్‌ హిగ్స్‌ను విధుల్లో నుంచి తొలగించడమే కాకుండా కోర్టులో దావా వేశారు. దాదాపు దశాబ్దకాలం పాటు మ్యూజియంలోని రత్నాలు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను మాయం చేశాడని, తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని దావాలో పేర్కొన్నారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి హీథర్ విలియమ్స్ నాలుగు వారాల్లోగా తన దగ్గర ఉన్న వస్తువులను మ్యూజియానికి అప్పజెప్పాలని హిగ్స్‌ను ఆదేశించారు. ‘ఈబే’, ‘పేపాల్‌’ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 356 వస్తువులను రికవరీ చేసినట్లు మ్యూజియం అధికారులు కోర్టుకు వెల్లడించారు. అపహరణకు గురైనవన్నీ మిగిలిన వస్తువులను కూడా అప్పగించాలని, చోరీకి గురైన వస్తువులు చారిత్రక, సాంస్కృతికంగా చాలా ప్రాధాన్యం కలిగిన వస్తువులని తెలిపారు. నకిలీ పత్రాలను సృష్టించి, మ్యూజియం రికార్డులను తారుమారు చేసి, మ్యూజియం నుంచి చోరీ చేసిన కళాఖంగాలను వాటి అసలు విలువ కంటే తక్కువకు విక్రియంచేందుకు యత్నించాడని పేర్కొన్నారు.

మ్యూజియంలోని గ్రీస్‌, రోమ్‌ విభాగాల్లో హిగ్స్‌ దాదాపు రెండు దశాబ్దాలకుపైగా పనిచేశాడు. తనపై వచ్చిన ఆరోపణలను హిగ్స్‌ ఖండించాడు. అనారోగ్యం కారణంగా మంగళవారం విచారణకు హాజరు కాలేకపోతునన్నట్లు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అపహరణపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వస్తువులు చోరీకి గురైన విషయం వెలుగులోకి రావడంతో గతేడాది ఆగస్టులోనే మ్యూజియం డైరెక్టర్‌ హార్ట్‌విగ్ ఫిషర్ రాజీనామా చేశారు. ఖళాఖండాలు ఈబేలో విక్రయానికి ఉంచినట్లు ఓ చరిత్రకారుడు హెచ్చరించినా తాను చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యానని క్షమాపణలు తెలిపారు. ఈ చోరీ ఉదంతం కారణంగా 265 ఏళ్ల నాటి లండన్‌ మ్యూజియం ప్రతిష్ట దెబ్బతిందని ట్రస్టీస్‌ ఛైర్మన్ జార్జ్ ఒస్బోర్న్ అన్నారు. సెంట్రల్ లండన్‌లోని బ్లూమ్స్‌బరీ జిల్లాలో ఉన్న 18వ శతాబ్దం కాలంనాటి మ్యూజియం బ్రిటన్‌లని అతిపెద్ద పర్యాటక ఆకర్షణ ప్రాంతాలలో ఒకటి. ప్రతి యేట 6 మిలియన్ల మంది పర్యాటకులు దీనిని సందర్శిస్తారు. ఇక్కడ ఈజిప్షియన్ మమ్మీలు, పురాతన గ్రీకు విగ్రహాల నుంచి వైకింగ్ హోర్డ్‌లు, 12వ శతాబ్దపు చైనీస్ కవిత్వంతో కూడిన స్క్రోల్స్, కెనడాలోని స్థానిక ప్రజలు సృష్టించిన మాస్క్‌ల వరకు ఉన్న సేకరణను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అమితాసక్తి కనబరుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version