National
Bomb Threats: ఎన్నికల వేళ దేశంలోని ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు.. హైఅలర్ట్
Bomb Threats: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ కీలక విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం పెను దుమారం రేపుతోంది. సోమవారం దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులకు సంబంధించిన ఈ మెయిల్స్ రావడం సంచలనంగా మారింది. బాంబు బెదిరింపులతో అలర్ట్ అయిన అధికారులు.. రంగంలోకి దిగి ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీని పటిష్ఠం చేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్వాడ్‌లను రంగంలోకి దించి.. ఎయిర్‌పోర్టుల్లో పూర్తిగా సోదాలు నిర్వహించారు. ఎన్నికల వేళ ఇలాంటి హెచ్చరికలు రావడంతో అంతా అలర్ట్ అయ్యారు.
రాజస్థాన్‌లోని జైపూర్ విమానాశ్రయానికి, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు, గోవాలోని డాబోలిమ్ విమానాశ్రయాలకు సోమవారం ఉదయం ఈ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఆయా విమానాశ్రయాల అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపు మెయిల్స్ కారణంగా అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దింపి.. ఎయిర్‌పోర్టుల్లో అణువణువు సోదాలు చేపట్టారు. అయితే ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.
ఇక జైపూర్, నాగ్‌పూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బెదిరింపు మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో దేశంలోని ఇతర విమానాశ్రయాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులు, సిబ్బందితోపాటు ఎయిర్‌పోర్టుల్లోకి వచ్చే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు.. ఈ బాంబు మెయిల్ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఈ-మెయిల్ పంపించిన వారిని పట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ కారణంగా జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలుగలేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇక ఇటీవలి కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు వరుస బాంబు పేలుడు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై, ముంబైలోని పలు పాఠశాలలు, ఎయిర్‌పోర్టులకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి.