National
Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్ స్టేషన్!
Couple dead in police custody : బిహార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. పోలీస్ కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి, అతని మైనర్ భార్య అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు.. పోలీస్ స్టేషన్‌ని తగలబెట్టారు!
ఇదీ జరిగింది..
బిహార్ అరారై జిల్లాలోని తరాబరి గ్రామంలో నివాసముంటున్నాడు ఆ వ్యక్తి. అతని మొదటి భార్య మరణించడంతో రెండు రోజుల క్రితం మరొక పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె వయస్సు 14ఏళ్లు. అంటే ఆమె ఒక మైనర్. ఇండియాలో పెళ్లి చేసుకోవాలంటే సదరు వదువు వయస్సు 18 ఉండాలి.
ఈ నేపథ్యంలో.. పెళ్లి తర్వాత ఆ వ్యక్తి, అతని మైనర్ భార్యను పోలీసులు గురువారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.
Police custody death in Bihar : కాగా.. పోలీస్ లాకప్‌లో ఉన్న ఆ వ్యక్తి.. లాకప్ డోర్ మీదకు ఎక్కి, గుడ్డతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అది ఆత్మహత్య అని పోలీసులు అంటున్నారు. మరి ఆ మైనర్ ఎలా మరణించిందో తెలియరాలేదు.
పోలీస్ కస్టడీలో ఇద్దరు మరణించారని తెలుసుకున్న గ్రామస్థులు.. విధ్వంసం సృష్టించారు. తరాబరి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, దానిని తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీస్ స్టేషన్‌పై గ్రామస్థుల దాడిలో.. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
“మా వాళ్లు ఆత్మహత్య చేసుకోలేదు. పోలీసులే కస్టడీలో చంపేశారు. కొట్టికొట్టి వదిలేశారు. అందుకే ప్రాణాలు కోల్పోయారు.” అని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న తర్వాత.. పరిసర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలు ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
Tarabari police station : అయితే.. పోలీసులే తమ వారిని చంపేశారని గ్రామస్థులు చేస్తున్న ఆరోపణలపై అధికారులు మౌనంగా ఉంటున్నారు. ఈ విషయంపై వారు ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
గ్రామస్థులు మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో నినాదాలు చేస్తున్నారు.