International

ఇజ్రాయెల్​కు బిగ్​ సపోర్టర్ అమెరికా కండిషన్​- అలా చేస్తేనే తమ మద్దతు ఉంటుందని క్లారిటీ! – BIDEN

Published

on

Biden Netanyahu : గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఏడుగురు సహాయక సిబ్బంది మరణించిన ఘటన తర్వాత నెతన్యాహు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ముందునుంచి అండగా ఉంటున్న అమెరికా కూడా తాజాగా ఆ దేశానికి పరోక్షంగా చురకలంటించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుతో గురువారం ఫోన్​లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు పలు సూచనలు చేశారు. గాజాతో ఇజ్రాయెల్‌ యుద్ధం విషయంలో సామాన్య పౌరులు, సహాయక సిబ్బందిని రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయమై భవిష్యత్తులో తమ మద్దతు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

30 నిమిషాలు ఫోన్​లో
అంతేకాకుండా కాల్పుల విరమణ తప్పనిసరి అని చెప్పారు. ఆలస్యం చేయకుండా గాజాతో ఈ విషయమై ఒప్పందం చేసుకోవాలని ఇజ్రాయెల్‌ను బైడెన్ కోరినట్టు శ్వేతసౌధం తెలిపింది. ఇటీవల ఏడుగురు ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ సహాయక సిబ్బందిపై జరిగిన ఘటనపై ఇజ్రాయెల్ స్వతంత్ర దర్యాప్తు కోసం పిలుపునిచ్చిన నేపథ్యంలో బైడెన్, నెతన్యాహుతో ఫోన్​లో 30 నిమిషాల పాటు సంభాషించారు.

Advertisement

మాది పెద్ద తప్పే : ఇజ్రాయెల్​
Israel Attack On WCK Employees : సోమవారం గాజా పౌరులకు ఆహార సామగ్రిని అందించేందుకు వెళ్లిన ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్’ (డబ్ల్యూసీకే) స్వచ్ఛంద సంస్థకు చెందిన సహాయక సిబ్బందిపై ఇజ్రాయెల్ వైమానిక దాడికి తెగబడింది. ఈ ఘటనలో ఆరుగురు విదేశీ సహాయకులు, భారత సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్‌ ఒకరు సహా మొత్తం ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అమెరికా, బ్రిటన్​ సహా పలు దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. మానవతా సాయం అందిస్తున్న సిబ్బందిపై ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటంపై పెదవి విరిచాయి. ఈ ఘటనను దుందుడుకు చర్యగా అభివర్ణిస్తూ ఇజ్రాయెల్‌ను వివరణ కోరాయి.

దీనిపై స్పందించిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని చెప్పుకొచ్చారు. స్వతంత్ర దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా లక్ష్యాన్ని గుర్తించడంలో పొరబడ్డామని ఇజ్రాయెల్‌ సైన్యాధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జీ హలేవీ తెలిపారు. దీన్ని ఘోర తప్పిదంగా అంగీకరించిన ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

నో హెల్ప్!
మరోవైపు గాజాకు సముద్ర మార్గం ద్వారా వేల టన్నుల ఆహారాన్ని చేరవేస్తోన్న డబ్ల్యూసీకే ఎన్​జీఓ తాజా పరిణామంతో తక్షణం తమ సహాయ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, మరణించిన తమ సిబ్బందిలో బ్రిటన్‌ వాసులతోపాటు ఆస్ట్రేలియా, పోలండ్‌, అమెరికా, కెనడాకు చెందిన వారు ఉన్నారని వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version