International
Biden vs Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో 70ఏళ్ల కిందటి సీన్ మరోసారి రిపీట్!
Biden vs Trump : మళ్లీ సేమ్ అభ్యర్థులు.. ఈ సారి నువ్వా.. నేనా అంటున్నారు. ఎన్నికల బరిలో నీ పెతాపమో.. నా పెతాపమో తేల్చుకుందామని సవాళ్లు విసురుకుంటున్నారు. అగ్రరాజ్యంలో జరిగే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. మళ్లీ వాళ్లిదరూ తలపడితే 70 ఏళ్ల క్రితం సీన్ రిపీట్ కానుంది.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి డెమోక్రాటిక్ పార్టీ తరఫున జో బైడెన్ నామినేషన్ ఖరారైంది. కేవలం అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. తాజాగా జరిగిన జార్జియా ప్రైమరీలో ఆయన గెలుపొందారు. దీంతో పార్టీ నుంచి నామినేట్ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను సంపాదించుకున్నారు. వాషింగ్టన్, మిస్సిసిపీ, నార్తర్న్ మరియానా ఐలాండ్స్‌లోనూ ఆయన విజయం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
అమెరికా భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల ముందు ఉందని జార్జియాలో విజయం తర్వాత బైడెన్ అన్నారు. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమతి ఇస్తారా అని ప్రశ్నించారు. మన స్వేచ్ఛను, భ్రదతను కాపాడుకునే హక్కును పునరుద్ధరిస్తారా? లేదా వాటిని లాక్కునేవారికి అవకాశమిస్తారా అని బైడెన్ ప్రశ్నించారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే.. అమెరికాను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు బైడెన్.
అటు రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. తాజాగా వాషింగ్టన్ ప్రైమరీలోనూ ఆయన విజయం సాధించారు. దీంతో నామినేషన్‌కు కావాల్సిన ప్రతినిధుల మద్దతు లభించింది. మరికొన్ని ప్రైమరీల్లోనూ ఆయన విజయం ఖాయంగానే కనిపిస్తోంది. చివరి వరకు పోటీగా నిలిచిన నిక్కీ హేలీ రేసు నుంచి వైదొలగడంతో.. బైడెన్, ట్రంప్ రెండోసారి అధ్యక్ష పీఠం కోసం పోటీ పడనున్నారు. అమెరికాలో గడిచిన 70 ఏళ్ల చరిత్రలో.. అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు రెండోసారి పోటీపడే సీన్ రిపీట్ కానుంది.
మరోవైపు తాను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. క్యాపిటల్ హిల్ బందీలను విడిపిస్తానన్నారు ట్రంప్. 2021లో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో అరెస్టై జైల్లో ఉన్న వారిని బందీలుగా అభివర్ణించారు. తాను ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడితే ఆ బందీలను విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.