National

Bengaluru Water Crisis: దక్షిణ భారత రాష్ట్రాల్లో నీటి సంక్షోభం.. బెంగళూరు సమస్యే మిగిలిన నగరాలకు!

Published

on

Bengaluru Water Crisis: ఏ జీవికైనా బ్రతకడానికి నీరు అనేది అత్యవసరం. అలాంటిది నీరు లేకపోతే మనుషులతోపాటు జంతువులు కూడా అల్లాడిపోతూ ఉంటారు. ఇక ఎండా కాలంలో అయితే నీటి అవసరం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఎండాకాలంలోనే భూగర్భ నీటి మట్టాలు తగ్గిపోయి.. నీటి కొరత ఏర్పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగు కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి సమస్యతో అల్లాడిపోతూ ఉంది. అయితే తాజాగా సెంట్రల్ వాటర్ కమిషన్ సంచలన విషయాలు వెల్లడించింది. బెంగళూరు మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రానున్న రోజుల్లో తీవ్ర నీటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి.

ఈసారి వేసవి కాలంలో దేశంలో భానుడి భగభగలు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల బెంగళూరు నగరం ఎదుర్కొన్న నీటి సంక్షోభాన్ని దేశం మొత్తం చూసింది. ఈ క్రమంలోనే ఇదే సమస్య రానున్న రోజుల్లో దక్షిణ భారత రాష్ట్రాలు మొత్తం ఎదుర్కొంటాయని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లలో నీటిమట్టం భారీగా తగ్గుతోందని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లు ఎండిపోయే దశలో ఉన్నాయని చెప్పింది. దీంతో భవిష్యత్‌లో ఈ రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించింది.

దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షణలో మొత్తం 42 రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ 42 రిజర్వాయర్లలో మొత్తం 53.334 BCM (బిలియన్ క్యూబిక్ మీటర్లు) నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అయితే ఈ రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న మొత్తం నీటి నిల్వ కేవలం 8.865 BCM అని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది. ఇది వాటి మొత్తం సామర్థ్యంలో కేవలం 17 శాతం మాత్రమేనని తెలిపింది. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుకు సంబంధించి సీడబ్ల్యూసీ బులెటిన్‌ను విడుదల చేసింది. దక్షిణాదిన రిజర్వాయర్లలో నీటి నిల్వ తగ్గిపోతుండటంతో సాగునీరు, తాగునీరు, జలవిద్యుత్‌కు తీవ్ర ఇబ్బంది ఎదురుకానుంది.

దక్షిణాది రాష్ట్రాలతోపోల్చితే తూర్పున ఉన్న రాష్ట్రాల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పదేళ్ల సగటుతో పోల్చితే.. గత సంవత్సరం నీటి నిల్వలు గణనీయమైన స్థాయిలో పెరిగాయి. ఆ రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురుస్తుండటంతో రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తూ ఉన్నాయి. తూర్పు ప్రాంతంలో ప్రస్తుతం 23 మానిటరింగ్ రిజర్వాయర్లలో మొత్తం 20.430 BCM నీటి నిల్వ సామర్థ్యంతో 7.889 BCM నీరు ఉన్నట్లు కేంద్ర జల సంఘం తెలిపింది. ఇది వాటి మొత్తం నీటి సామర్థ్యంలో 39 శాతం అని వెల్లడించింది.

మరోవైపు పశ్చిమ భారతదేశంలోని గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సీడబ్య్లూసీ పరిశీలనలో ఉన్న 49 రిజర్వాయర్లలో నీటి నిల్వ స్థాయి 11.771 BCM ఉందని పేర్కొంది. మొత్తం సామర్థ్యంలో ప్రస్తుత నీటిమట్టం 31.7 శాతమని.. గత పదేళ్ల సగటు (32.1 శాతం) కంటే గతేడాది కొద్దిగా నీటి నిల్వ స్థాయి తగ్గిందని తెలిపింది. ఇవే కాకుండా దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో కూడా నీటి నిల్వ స్థాయిలు తగ్గినట్లు వెల్లడించింది.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version