Andhrapradesh
బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ఆదాయం
Heavy Rush in Vijayawada Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవురోజులు రావటంతో బెజవాడ దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడితో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. మరోవైపు భక్తులు పెద్దసంఖ్యలో రావటంతో కనకదుర్గమ్మ ఆలయ హుండీకి భారీగా ఆదాయం వచ్చింది. ఆదివారం ఒక్కరోజే అమ్మవారిని 52,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. 4350 మంది భక్తులు అమ్మవారికి ఆషాడం సారె సమర్పించారు. వివిధ సేవల రూపంలో దేవస్థానానికి 51,16,548 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని వీఐపీ దర్శనాలను రద్దు చేశారు.
దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేత
మరోవైపు దుర్గ గుడి ఘాట్ రోడ్డును ఆదివారం మూసివేశారు. వర్షాలకు కొండ చరియలు విరిగి పడుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఆదివారం ఘాట్ రోడ్డును మూసివేశారు. మహా మండపం నుంచి మాత్రమే భక్తులను అనుమతించారు. అలాగే దుర్గాఘాట్ నుంచి కేవలం దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చిన నేపథ్యంలో పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రధం సెంటర్, పద్మావతి ఘాట్ల వద్ద వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు చేశారు.
కనక దుర్గమ్మకు తెలంగాణ నుంచి బంగారు బోనం
మరోవైపు ఆషాడ మాసం సందర్భంగా హైదరాబాద్‌లో బోనాల పండుగ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామికి తెలంగాణ నుంచి బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర్ మహంకాళీ జాతర బోనాల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. కమిటీ సభ్యులకు దుర్గ గుడి ఈవో కె.ఎస్ రామారావు స్వాగతం పలికారు. అనంతరం దేవతా మూర్తులకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కమిటీ సభ్యులు నృత్యాలు, కోలాటాలతో ఊరేగింపుగా బయలుదేరి ఆలయానికి చేరుకుని బంగారు బోనం సమర్పించారు.