Technology
బాబోయ్ జాగ్రత్త..! నాలుగు నెలల్లో దేశంలో ఎన్ని సైబర్ మోసాలు జరిగాయో తెలుసా?
Cyber Crimes : భారత దేశంలో డిజిటల్ చెల్లింపు వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. అదే స్థాయిలో ఆన్ లైన్ మోసాలకూడా పెరుగుతున్నాయి. దేశంలో ప్రతీరోజూ దాదాపు 7వేల సైబర్ ఫిర్యాదు నమోదవుతున్నాయి. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) డేటా వెల్లడించింది. డిజిటల్ చెల్లింపుల ద్వారా ప్రజలకు సమయం ఆదా అవుతున్నా.. సైబర్ మోసాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆన్ లైన్ మోసాలలో ఎక్కువగా కంబోడియా, మయన్మార్, లావోస్ నుంచి జరుగుతున్న ఇండియన్ సైబర్ క్రైం కో-ఆర్డినేటర్ సెంటర్ తెలిపింది.
నాలుగు నెలల్లో భారీగా..
ప్రతీయేటా సైబర్ మోసాల భారిన పడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2019 సంవత్సరంలో 26,049 సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. 2020లో 2,57,000 ఫిర్యాదులు. 2021లో 4,52,000 ఫిర్యాదులు. 2022లో 966,000 ఫిర్యాదులు, 2023 సంవత్సరంలో 1.56 మిలియన్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక 2024 విషయానికొస్తే.. ఏప్రిల్ 30వ తేదీ వరకు దేశంలో సైబర్ మోసాలకు గురయ్యామని 7,40,000 మంది ఫిర్యాదులు చేశారు. అయితే, దేశంలోని ప్రజలు వివిధ రకాల ఆన్ లైన్ మోసాల భారినపడి గత కొన్ని నెలల్లో రూ.7061.51 కోట్లు నష్టపోయారు. వీటిలో 12శాతం అంటే దాదాపు రూ. 812 కోట్లు రికవరీ చేసినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సీఈవో తెలిపారు. గత నాలుగు నెలల్లో ఆన్ లైన్ ట్రేడింగ్ మోసాల భారినపడి దేశ ప్రజలు రూ.1420 కోట్లకుపైగా నష్టపోయారు. డిజిటల్ అరెస్ట్ మోసాల భారినపడి దాదాపు రూ. 120కోట్లు, పెట్టుబడి మోసాలలో రూ. 222.58 కోట్లు, డేటింగ్ పేరుతో మోసాలలో దాదాపు 13 కోట్ల సొమ్మును భారతీయులు పోగొట్టుకున్నారు.
మోసాల నుండి ఇలా జాగ్రత్తలు తీసుకోండి..
♦ ఆన్ లైన్ ద్వారా సులభంగా అధిక డబ్బును సంపాదించొచ్చని ఆశచూపే యాప్ లు, మెస్సేజ్ ల జోలికి వెళ్లకండి.
♦ ఉద్యోగ ఆఫర్ పేరుతో వచ్చే మెస్సేజ్ ల పట్ల జాగ్రత్తలు పాటించండి.
♦ అధికారిక వెబ్ సైట్ లు, యాప్ ల ద్వారా ఉద్యోగ ఆఫర్లు, పెట్టుబడి అవకాశాలు చట్టబద్ధతను ధృవీకరించండి.
♦ మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు..
♦ మీ బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. చాటింగ్ యాప్ లలో షేర్ చేయొద్దు. ఇలాచేస్తే మీరు మోసానికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
♦ తెలియని నెంబర్ నుంచి వచ్చే లింక్ లు, ఫైల్స్ డౌన్ లోడ్ చేయకండి.
♦ ఏదైనా సైబర్ మోసం జరిగితే, ఎవరైనా దీన్ని చేయడానికి ప్రయత్నిస్తుంటే వెంటనే సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోర్టల్ కి తెలియజేయండి. లేదా సహాయం కోసం 1930 నెంబర్ కు కాల్ చేయొచ్చు.