International
సముద్రంలోనే 37గంటలు- 80కి.మీ దూరం కొట్టుకుపోయిన యువతి- అయినా సేఫ్! – sea japan swimmer rescue
Sea Japan Swimmer Rescue : చైనాకు చెందిన 20ఏళ్ల యువతి జపాన్ బీచ్‌లో ఈత కొడుతూ గల్లంతైంది. సోమవారం రాత్రి కనిపించకుండాపోయిన ఆమె ఆచూకీ, ఎట్టకేలకు 37గంటల తర్వాత బుధవారం ఉదయం లభించింది. ఈత కొట్టడానికి దిగిన బీచ్ నుంచి దాదాపు 80కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో తేలుతూ ప్రత్యక్షమైంది. అది కూడా సజీవంగా, సురక్షితంగా!!
ఇదీ జరిగింది
చైనాకు చెందిన ఓ యువతి సోమవారం రాత్రి స్విమ్మింగ్ రింగ్ ధరించి జపాన్‌లోని షిమోడా నగర బీచ్‌లో ఈత కొడుతుండగా అలల ధాటికి అకస్మాత్తుగా కొట్టుకుపోయింది. అప్రమత్తమైన యువతి స్నేహితురాలు వెంటనే జపాన్ కోస్ట్ గార్డ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన జపాన్ కోస్ట్ గార్డ్ దళాలు, బీచ్ సహా పరిసర ప్రాంతాల్లో గాలించాయి. స్విమ్మింగ్ రింగ్ ధరించి ఈత కొడుతూ ఓ యువతి తప్పిపోయిందని, సముద్ర జలాల్లో ఆమె తేలుతూ కనిపిస్తే సమాచారం ఇవ్వాలనే సందేశాన్ని అందరికీ పంపారు.
ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున బోసో ద్వీపకల్పపు దక్షిణ దిశలోని సముద్ర జలాల్లో స్పృహలేని స్థితిలో స్విమ్మింగ్ రింగ్‌లో తేలియాడుతున్న యువతిని ఓ కార్గోషిప్ డ్రైవర్లు గుర్తించారు. అటువైపుగా వెళ్తున్న కాకువా మారు నంబర్ 8 అనే ఎల్పీజీ ట్యాంకర్ సిబ్బందికి ఈ సమాచారాన్ని అందించారు. దీంతో ఆ ట్యాంకరుకు సంబంధించిన సిబ్బంది సాహసోపేతంగా సముద్రంలోకి దూకి ఆ యువతిని రక్షించారు.
37గంటలు నీటిలోనే ఉన్నా!
అనంతరం జపాన్ కోస్ట్ గార్డ్‌కు సమాచారాన్ని అందించారు. దీంతో హుటాహుటిన హెలికాప్టర్‌ను పంపించి యువతిని రక్షించారు. అనంతరం ఆస్పత్రిలో చేర్చగా, ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధరించారు. ప్రాధమిక చికిత్స అనంతరం యువతిని డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. సముద్ర జలాల్లో గంటల కొద్దీ తేలియాడినా, ఎండలోనే అనేక గంటలున్నా ఆ యువతి ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం పడలేదని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్వల్ప డీహైడ్రేషన్ సమస్యను మాత్రమే యువతిలో గుర్తించామని డాక్టర్లు తెలిపారు.