National
జాతీయ భద్రతా సలహాదారుగా మూడోసారి కూడా అజిత్ ధోవల్.. ఎందుకో తెలుసా?
భారతదేశంలో అధికార వ్యవస్థ సర్వస్వతంత్రమైనది అయినప్పటికీ… ఉన్నత పదవుల్లో రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను, తమ భావజాలానికి దగ్గరగా ఉండేవారిని నియమిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే దేశంలో అయినా రాష్ట్రల్లో అయినా అధికారం మారినప్పుడల్లా అధికారులు మారుతుంటారు. అలాగే ఎంత నమ్మినప్పటికీ.. ఒకే పదవిని… అందునా అత్యంత కీలకపదవిని ప్రభుత్వం ఒక వ్యక్తికి పలుమార్లు కట్టబెట్టడం అన్నది అస్సలు జరగదు.
కానీ దేశంలో ఓ వ్యక్తి విషయంలో ఇలాంటి సహజ విషయాలన్నీ పక్కకుపోతుంటాయి. అన్నిరకాల మినహాయింపులూ ఆయనకు దక్కుతుంటాయి. పార్టీల సిద్ధాంతాలతో, ప్రభుత్వాల నియయనిబంధనలతో పనిలేకుండా దేశభద్రత విషయంలో అందరూ ఆయనను నమ్ముతుంటారు. అతిపెద్ద బాధ్యతల నిర్వహణ అప్పగిస్తుంటారు. ఆ ఒకే ఒక్కడు అజిత్ ధోవల్.
మూడోసారి..
జాతీయ భద్రతాసలహాదారుగా అజిత్ ధోవల్ వరుసగా మూడోసారి నియమితులయ్యారు. క్యాబినెట్ నియామకాల కమిటీ ధోవల్ నియామకానికి ఆమోదముద్ర వేసింది. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రితో సమానంగా హోదా ఉంటుంది. ఇది అధికారికం. అనధికారికంగా చెప్పాలంటే…పదేళ్లగా కేంద్రంలో ప్రధాని మోదీ నంబర్ వన్, అమిత్ షా నంబర్ 2 అయితే.. అజిత్ ధోవల్‌ను నంబర్ 3 అన్న అభిప్రాయం దేశవ్యాప్తంగా నెలకొంది.
అమిత్ షా తర్వాత…. ప్రధాని మోదీ ఎక్కువగా నమ్మేది అజిత్ ధోవల్‌నే. రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి అయిన ధోవల్‌కు వరుసగా మూడోసారి అత్యంత కీలక పదవి దక్కించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాలన్నీ జాతీయ భద్రతా సలహాదారుడి పర్యవేక్షణలోనే సాగుతుంటాయి. భద్రతాపరంగా దేశాన్ని పటిష్టస్థితిలో నిలపడం ఆ పదవిలో ఉన్నవారి ప్రధాన బాధ్యత. మరి ఇంత కీలక పదవిలో అజిత్ ధోవల్‌నే ప్రధాని మోదీ ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే….దానికి సమాధానం అజిత్ ధోవల్ పదేళ్లగా సాధించిన విజయాలు మాత్రమే కాదు. ఇంటెలిజెన్స్ అధికారిగా దేశవిదేశాల్లో ఆయన చేసిన సాహసాలు.
అప్పటినుంచి..
ప్రధాని మోదీ నేతృత్వంలో పదేళ్ల క్రితం తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2014 మే 30న తొలిసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ ధోవల్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి ఆయన జాతీయ భద్రత, మిలటరీ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగాల నిర్వహణ చూసుకంటున్నారు. వ్యూహాత్మక ఆలోచనలు, ప్రణాళికాబద్ధ కార్యాచరణతో జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ ధోవల్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో తన మార్క్ చూపారు.
ప్రధాని మోదీ ఆంతరంగికుల్లో ఒకరిగా మారారు. సీమాంతర ఉగ్రవాద నియంత్రణ, అణుసంబంధిత వ్యవహారాలపై అజిత్ ధోవల్‌కు దేశంలో ఎవరికీ లేనంత పట్టుంది. పదేళ్ల కాలంలో దేశభద్రతకు సంబంధించిన అనేక వ్యవహారాల్లో అజిత్ ధోవల్ కీలక పాత్ర పోషించారు.
ధోవల్ వ్యహాలు
భద్రతాపరంగా దేశం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండడం, ఉగ్రదాడులు తగ్గడం, సరిహద్దు వివాదాల్లో పై చేయి సాధించడం, విదేశాంగవిధానంలో అత్యంత బలంగా మారడానికి అజిత్ ధోవల్ వ్యూహాలే కారణం. 2017లో తలెత్తిన డోక్లాం వివాదం విషయంలోనూ, 2020లో తూర్పు లదాఖ్ వివాదంలోనూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీపై ధోవల్ అనుసరించిన ఎదురుదాడి వ్యూహం వల్లే యుద్ధానికి దారితీయకుండా ఉద్రిక్తతలు చల్లారాయి. చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికి అజిత్ ధోవల్ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. యూరి దాడులు తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్‌లోనూ, బాలాకోట్ దాడుల్లోనూ ధోవల్‌ది కీలక పాత్రగా భావిస్తారు.
ప్రధాని మోదీ లక్ష్యాలకు తగ్గట్టుగా ఆయన జాతీయ భద్రతా విధానాలు రూపొందించి అమలుచేస్తున్నారు. 1968 బ్యాచ్ కేరళ క్యాడర్‌కు చెందిన అజిత్ ధోవల్ జాతీయ భద్రతా సలహాదారు కాకముందు కూడా దేశ భద్రతా వ్యవహారాలకు ముఖచిత్రంగా మారారు. నిఘా వ్యవహారాలపై ఆయనకున్నంత పట్టు దేశంలో మరెవరికీ లేదనడం అతిశయోక్తి కాదు.
జాతీయ భద్రతా సలహాదారుగా మారకముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేసిన ధోవల్‌కు ఆ విభాగంలో 33ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జమ్ముకశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో అనేక భద్రతా సవాళ్లను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొని దేశం సురక్షితంగా ఉండడంలో కీలకపాత్ర పోషించారు.
జాతీయ భద్రతా సలహాదారుగా జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాల్లో సలహాలివ్వడం ధోవల్ ప్రధాన బాధ్యత. అయితే ఇంటెలిజెన్స్ వ్యవహారాల్లో ధోవల్‌కు ఉన్న అనుభవం, పట్టు, వివాదాలను పరిష్కరించగల నేర్పును గమనించిన ప్రధాని దేశభద్రతకు సంబంధించిన వ్యవహారాల నిర్వహణలో ఆయనకు పూర్తి స్వేఛ్చ కల్పించారని….ఆయన తీసుకునే నిర్ణయాలన్నింటినీ మోదీ సమర్థిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది.