Andhrapradesh

AP TS Famous Shiva Temples : మహాశివరాత్రి స్పెషల్- తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రాలివే!

Published

on

AP TS Famous Shiva Temples : మహా శివరాత్రి పర్వదినం కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రాలు(AP TS Famous Shiva Temple ) ముస్తాబవుతోన్నాయి. ఈ నెల 8న మహా శివరాత్రి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శక్తివంతమైన కొన్ని శైవ క్షేత్రాల గురించి తెలుసుకుందాం.

శ్రీశైలం
నంద్యాల జిల్లాలోని శ్రీశైలం(Srisailam Temple) ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. నంద్యాల నుంచి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. హైదరాబాద్ నుంచి పాలమూరు జిల్లా మీదుగా 229 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని రెండో శతాబ్దంలో విజయ నగర రాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీశైలంలో క్షేత్రంలో మల్లికార్జున స్వామితో పాటు పాతాళ గంగ, శిఖరేశ్వర ఆలయం, సాక్షి గణపతి దేవాలయం, పాలధార, పంచధార సుందర ప్రదేశాలు ఉన్నాయి. శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం స్వామి వారిని దర్శించుకుంటారు.

సంగమేశ్వర ఆలయం
కర్నూలు జిల్లాలో సప్త నదుల మధ్య ఉన్న సంగమేశ్వర ఆలయం(sangameshwara temple) ప్రసిద్ధ శైవ క్షేత్రం. కర్నూలు నుంచి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. సప్త నది సంగమ ప్రదేశంలో ప్రతీ ఏడాది వేసవిలో మాత్రమే శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. వేల ఏళ్ల నాటి ఈ ఆలయంలో వేప లింగం నేటికి చెక్కుచెదరకుండా ఉంది.

పంచారామాలు
ఏపీలోని 5 శివక్షేత్రాలు పంచారామాలుగా(Pancharama) పిలుస్తారు. కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం, భీమారామం, పల్నాడు జిల్లాలోని అమరారామంను పంచారామాలు అంటారు.

  • అమరారామం-
  • అమరావతి క్షేత్రంలోని అమరేశ్వరస్వామి (Amararama)దేవాలయం గుంటూరు నగరం నుంచి 35 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పడని అంటారు. ఇక్కడి శివుడు అమరేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు.

  • ద్రాక్షారామం-
  • కోనసీమ జిల్లాలోని కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామ(Draksharamam) క్షేత్రం ఉంది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ భీమేశ్వరుడు, మాణిక్యాంబ భక్తుల పూజలందుకుంటున్నారు.

  • సోమారామం-
  • పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో గునుపూడిలో సోమారామం(Somarama) క్షేత్రం ఉంది. ఇక్కడ సోమేశ్వరుడు, ఉమాదేవి అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్ధనస్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని తూర్పుచాళుక్య రాజైన చాళుక్య భీముడు మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలురోజుల్లో తెలుపు, నలుపు రంగులో ఉండే ఇక్కడి శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంటుంది. పౌర్ణమి నాటికి యథారూపంలోకి వస్తుంది.

  • కుమార భీమారామం-
  • కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమార భీమారామం(Bhimaramam) క్షేత్రం ఉంది. ఇక్కడ భీమేశ్వరుడు, తల్లి బాలా త్రిపుర సుందరి భక్తుల పూజలందుకుంటున్నారు. ఈ ఆలయాన్ని చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో ఉంది.

  • క్షీరారామం-
  • పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్షీరారామం(Ksheerarama) క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి, పార్వతి అమ్మవారు భక్తుల పూజలందుకుంటున్నారు. ఈ లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని క్షేత్ర కథనంలో ఉంది. ఈ ఆలయంలో తొమ్మిది అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో రాజగోపురం ఉంటుంది.


    రామప్ప దేవాలయం
    ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం(Ramappa Temple) ప్రముఖ శైవ క్షేత్రం. హైదరాబాద్ నుంచి సుమారు 210 కిలోమీటర్ల దూరంలో రామప్ప ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారు. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. కాకతీయుల కాలంలో నిర్మించిన గోడల నిర్మాణంలో ఉన్న గ్రానైట్, డోలరైట్ స్తంభాలు ఇక్కడ ఉన్నాయి. ఫ్లోటింగ్ బ్రిక్స్ అని పిలిచే పోరస్ ఇటుకలతో ఒక ప్రత్యేకమైన పిరమిడ్ విమానం ఉంటుంది.

    కీసరగుట్ట
    హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో కీసరగుట్ట (Keesaragutta Temple)రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు స్వయంగా కీసరగుట్ట ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. కీసర గుట్ట ఆలయంలో శివయ్య, భవానీ, శివదుర్గ అమ్మవార్లను భక్తులు పూజిస్తారు.

    జోగులాంబ
    గద్వాల జిల్లాలో నవబ్రహ్మగా పిలిచే తొమ్మిది దేవాలయాలను చాళుక్యులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. కర్నూలు, గద్వాల సరిహద్దులో తుంగభద్ర నది పరివాహంలో ఈ ఆలయాలు ఉంటాయి. హైదరాబాద్ నుంచి సుమారు 215 కిలోమీటర్ల దూరంలో జోగులాంబ (Jogulamba Temple)ఆలయం ఉంటుంది.

    వేములవాడ
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ (Vemulawada Temple) దేవస్థానం ఉంది. హైదరాబాద్ సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ఆలయాన్ని 8-10వ శతాబ్దంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇక్కడి ధర్మ గుండంలో పవిత్ర స్నానం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్మకం.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Trending

    Exit mobile version