Andhrapradesh
Ap Social Welfare Schemes : సంక్షేమ పథకాలకు ఈసీ బ్రేక్ పై హైకోర్టులో లబ్దిదారుల పిటిషన్.. విచారణ వాయిదా
Ap Social Welfare Schemes : ఏపీలో అమల్లో ఉన్న డీబీటీ పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడంపై లబ్దిదారులు హైకోర్టును ఆశ్రయించారు. పథకాల అమలు కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ, చేయూత.. పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
జగనన్న విద్యదీవెన నిధులు విడుదలపై ఈసీ ఆంక్షలు విధించటం సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. జగనన్న విద్యాదీవెన కింద రూ.768 కోట్లు విడుదల చేయాల్సి ఉందని పిటిషనర్ తెలిపారు. ఇప్పటికే 97 కోట్లు విడుదల చేశామని మిగతా వారిపై ఈసీ ఆంక్షలు విధించినట్టు కోర్టుకు వెల్లడించారు. లబ్దిదారులు కొత్త వారు కాదని, రెండేళ్లుగా వాళ్లకి ఇస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చివరి అకడమిక్ ఇయర్ కావటంతో విద్యార్దులు ఇబ్బంది పడతారని కోర్టుకు దృష్టికి తెచ్చారు పిటిషనర్. కొత్తగా వినతి పత్రం ఇవ్వాలని దీనిపై ఈసీ నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వ పథకాలపై ఈసీ ఆంక్షలు విధించింది. సంక్షేమ పథకాల డబ్బుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది ఈసీ. ఎన్నికల కోడ్ పూర్తయ్యాకే నిధులు విడుదల చేసుకోవాలని ఆదేశించింది.
ఎన్నికల వేళ కావడంతో.. డీబీటీ విధానం ద్వారా పలు పథకాల లబ్దిదారులకు చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. ఈ పథకాలన్నీ గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని.. కొత్త పథకాలు కావని పేర్కొంది. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు కాబట్టి నిధుల విడుదలకు అంగీకరించాలని కోరింది. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. నిధుల విడుదలకు అనుమతి నిరాకరించింది. ఈసీ ఆంక్షలు, ఆదేశాలతో తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు అందాల్సిన సబ్సిడీ ఆగిపోయింది.
మరోవైపు ఖరీఫ్ కు సన్నద్ధమైన రైతులకు అందే సబ్సిడీ నిలిచిపోవడంతో రైతులు, ఫీజు రీయింబర్స్ మెంట్ కు బ్రేక్ పడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా అమల్లో ఉన్న పథకాలపై ఈసీ ఆంక్షలు విధించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదులు, అభ్యంతరాలపై లబ్దిదారులు మండిపడుతున్నారు. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించాలంటూ మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ ఫిర్యాదు చేయడంతో.. పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు చేయరాదంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. మిగతా ప్రభుత్వ పథకాలకు ఈసీ వర్తింప జేసింది. జగన్ ప్రభుత్వంలో అమలవుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ విద్యాదీవెన, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పథకాలు పేదలకు చేరలేదు. దీనికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబే అంటూ వైసీపీ ఆరోపిస్తుండగా.. లబ్దిదారులు ప్రతిపక్షాల తీరును తీవ్రంగా తప్పబడుతున్నారు.