Andhrapradesh

AP Schools Reopen Date 2024: ఏపీలో వేసవి సెలవుల పొడిగింపు.. తిరిగి బడి గంట మోగేది అప్పుడే!

Published

on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. జూన్‌12న పాఠశాలలు పునఃప్రారంభం కావల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే రోజున నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు విద్యాశాఖ ప్రకటించింది. దీంతో బుధవారానికి బదులు గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు అన్ని పాఠశాలల విద్యార్ధులు గమనించాలని విద్యాశాఖ ప్రకటన వెలువరించింది. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్‌తో కూడిన విద్యా కానుక కిట్లను అందజేసింది. వరుసగా నాలుగేళ్లపాటు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం మాత్రం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే పుస్తకాలు మండల కేంద్రాలకు చేరాయి. కానీ కొత్త సర్కార్‌ కొలువు దీరిన తర్వాత నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది.

పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేసింది. ఈ విద్యా కానుక కిట్‌లలో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలతోపాటు, టోఫెల్‌ వర్క్‌బుక్, ఫ్యూచర్‌ స్కిల్స్‌ సబ్జెక్ట్‌ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్‌ బ్యాగ్, బెల్ట్, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువు ఉంటుంది. ఇవి కాకుండా 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్‌ డిక్షనరీ అందిస్తారు. 6 నుంచి 10 తరగతులకు అయితే నోట్‌బుక్స్‌ ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం కూడా గతంలో ఇచ్చినట్టుగానే ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేస్తున్నారు. అలాగే, 3 నుంచి 10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్‌ఈలోకి మారిన సంగతి తెలిసిందే.

పదో తరగతి సాంఘికశాస్త్రం పుస్తకాలను సీబీఎస్‌ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్‌ పాలిటిక్స్‌ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్‌ సైన్స్‌ పుస్తకాలను ఆర్ట్‌ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్‌ స్కిల్స్‌ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version