Andhrapradesh

AP Polytechnic Counselling: నేటి నుంచి జూన్ 3 వరకు ఏపీ పాలిటెక్నిక్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్

Published

on

AP Polycet Admissions: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియను మే 23నుంచి ప్రారంభించారు. 2024 పాలిసెట్ ఫలితాలను ఏపీ సాంకేతిక విద్యా మండలి ఇప్పటికే విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా నేటి నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. ర్యాంకుల వారీగా నేటి నుంచి జూన్ 3వరకు ప్రవేశాలు కల్పిస్తారు. అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ గత బుధవారం విడుదలైంది.

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి జూన్ 3వరకు అడ్మిషన్లు జరుగుతాయి. వెబ్‌ ఆధారిత అడ్మిషన్లు కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ పూర్తి చేసి అడ్మిషన్లు కల్పిస్తారు.

ఈ పత్రాలు తప్పనిసరి….
పాలిసెట్‌ ఇప్పటికే ర్యాంకులు విడుదల చేసి ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఫీజు చెల్లించిన రశీదు, హాల్‌ టిక్కెట్, ర్యాంక్ కార్డు, పదో తరగతి ఉత్తీర్ణత ధృవపత్రం, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, అర్హులైన వారికి ఈడబ్ల్యుఎస్‌ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక క్యాటగిరీ పత్రాలు సమర్పించారు. ఎన్‌సిసి, ఆర్మీ, స్పోర్ట్స్‌, పోలీస్, దివ్యాంగులకు మే 31నుంచి జూన్‌ మూడో తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.

2024-25 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్‌ నిర్వహించారు. ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ నిర్వహించారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్ధులకు ఉన్నత విద్యా మండలి ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు ఉచిత శిక్షణ కూడా అందించింది. సంబంధించిన ఫీజు చెల్లింపు తదితర ఆన్ లైన్ ప్రక్రియకు మే 24వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు పది రోజుల పాటు అవకాశం ఉంటుందన్నారు. ధృవపత్రాల వెరిఫికేషన్ కు మే 27 నుండి జూన్ 3వ తేదీ వరకు ఎనిమిది రోజుల లోపు పూర్తి చేయవలసి ఉందని సాంకేతిక విద్యా మండలి కమిషనర్ నాగరాణి తెలిపారు.

Advertisement

విద్యార్ధులు కోరుకున్న కోర్సులతో పాటు కాలేజీలకు సంబంధించిన ఆప్షన్లను నమోదు చేయడానికి మే 31వ తదీ నుండి జూన్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూన్ 5వ తేదీన విద్యార్ధులు తాము ఎంచుకున్న ఆప్షన్లను మార్చుకోడానికి అవకాశం ఉంటుందని , జూన్ 7వ తేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని కమీషనర్ వివరించారు.

జూన్ పది నుంచి తరగతులు..
జూన్ పదవ తేదీ నుండి 14వ తేదీ వరకు 5 రోజుల లోపు ప్రవేశాలు ఖరారు అయిన విద్యార్ధులు అయా పాలిటెక్నిక్ కాలేజీలలో వ్యక్తిగతంగా, ఆన్ లైన్ విధానంలో రిపోర్టు చేయవలసి ఉంటుంది. జూన్ 10వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఏపీలో పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరుకాగా, 87.61 శాతం మేర 1,24,430 మంది అర్హత పొందారు. వీరిలో బాలికలు 56,464 మంది పరీక్షకు హాజరుకాగా, 89.81 శాతం మంది, బాలురలో 85,561 మంది హాజరుకాగా 86.16 శాతం అర్హత పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version