Andhrapradesh
AP Police Struggles: రోజుకు రెండు షిఫ్టులతో రగిలిపోతున్న ఆంధ్రా పోలీసులు..ఓ వైపు సిఎం భద్రత, మరోవైపు ఎన్నికల విధులు….
AP Police Struggles: ఏపీ పోలీసులు రోజుకు రెండు షిఫ్టుల విధులతో సతమతం అవుతున్నారు. వయసు మీరిన వారు, మహిళలు అనే తేడా లేకుండా రాష్ట్ర పోలీసు బలగాల్లో Police Force మూడొంతుల మంది ప్రత్యక్ష నరకాన్ని చవి చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి Attack తర్వాత పోలీసుల కష్టాలు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు పేరుతో వేల మంది పోలీసుల్ని మొహరిస్తున్నారు. అనకాపల్లిలో సిఎం పర్యటన ఉంటే విజయవాడ నుంచి పోలీసు బలగాల్ని తరలిస్తున్నారు.
నిప్పులు చెలరేగుతున్న ఎండల్లో నాయకులు ఏసీ బస్సుల్లో కూర్చుంటే పోలీస్ సిబ్బంది ఆ వాహనాల ముందు రోడ్డుకు ఇరువైపులా దడిలా నిలబడుతున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రిపై దాడి జరిగిన రోజు నగరంలో 22కి.మీ పొడవున యాత్ర సాగింది. ఆ రోజు బందోబస్తు విధుల కోసం దాదాపు 1500మందిని వినియోగించారు. అంతమంది ఉన్నా రాయి దాడి నుంచి సిఎం తప్పించుకోలేక పోయారు. ముఖ్యమంత్రిపై దాడి తర్వాత భద్రతను సమీక్షించిన డీజీపీ అన్ని జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి నైట్ హాల్ట్ నుంచి, యాత్ర ప్రారంభమయ్యే ప్రదేశం నుంచి జిల్లా ఎస్పీలు దగ్గరుండి సెక్యూరిటీ ఏర్పాట్లు చూడాలని ఆదేశించారు. డీజీపీ నుంచి ఆదేశాలు రావడంతో ముఖ్యమంత్రి యాత్ర సాగే ప్రతి సెక్టార్‌లో వందల కొద్ది సిబ్బందిని మొహరిస్తున్నారు. బస్సుకు ముందు రెండువైపులా వందల మంది కానిస్టేబుళ్లు, రోప్ పార్టీలు మండే ఎండల్లో నడుస్తూ ముందుకు సాగుతున్నారు.
వివిఐపిల భద్రతా విధులు పోలీసులకు సాధారణమే ఏ జిల్లా సిబ్బంది ఆ జిల్లాలో విధులకు పరిమితం అయ్యే వారు. ముఖ్యమంత్రిపై దాడి ఘటన తర్వాత పోలీసు ఉన్నతాధికారులు సెక్యూరిటీ రివ్యూ పేరుతో అన్ని జిల్లాల నుంచి బలగాలను సిఎం పర్యటన జరిగే ప్రాంతానికి తరలిస్తున్నారు. మహిళా కానిస్టేబుళ్లు, రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్న వారికి కూడా ఈ విధులు తప్పడం లేదు.
ఎన్నికల సమయంలో బందోబస్తు విధుల పేరుతో నలుగైదు జిల్లాల అవతలకు పంపడంపై కానిస్టేబుళ్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పోలీసులపై ఒత్తిడి బాగా పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు. వివిఐపిల భద్రత కోసం బలగాలను తరలించడంతో పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఉన్న సిబ్బందికి రోజుకు రెండు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించాల్సిందిగా ఆదేశించారు. సిఐ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికి రోజులో 8 గంటల మాత్రమే విశ్రాంతి ఇస్తున్నారు.
వ్యక్తిగత పనులు, విశ్రాంతి, భోజన విరామం, నిద్ర పోవడం మొత్తం 8గంటల్లోనే పూర్తి చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పోలీస్ సిబ్బంది చెబుతున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత…
రాష్ట్రంలో దాదాపు 70వేల మంది పోలీసులు ఉన్నారు. ఉన్నతాధికారులను మినహాయిస్తే ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకు డిజిగ్నేషన్లలో దాదాపు 45-50వేల మంది సిబ్బంది ఉంటారు. వీరిలో 95శాతం మంది ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి రోజుకు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు.
మహిళా కానిస్టేబుళ్లకైతే కనీసం కుటుంబాన్ని చూసుకోడానికి, పిల్లల సంరక్షణకు కూడా సమయం దొరకడం లేదని వాపోతున్నారు. ఐదారేళ్లలోపు చిన్న పిల్లల్ని చూసుకోవాల్సిన వారికి కూడా బందోబస్తు విధులు వేస్తున్నారని చెబుతున్నారు.
ఎన్నికల వేళ ఏపీ పోలీసులపై పడుతున్న పని భారం ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. వారికి రావాల్సిన సరెండర్ లీవ్స్ ఎన్ క్యాష్‌మెంట్‌ను కొన్నేళ్లుగా నిలిపివేశారు. పోలీస్ శాఖలోని ఉద్యోగులకు మూడు సరెండర్ లీవ్స్ బకాయిలు ఉన్నాయి. ఉద్యోగి బేసిక్‌ను బట్టి ఒక్కొక్కరికి సగటున లక్షన్నర నుంచి మూడు, నాలుగు లక్షల రుపాయల బకాయిలు రావాల్సి ఉంది.
ఓ వైపు పనిభారం, మరోవైపు తమకు రావాల్సిన వేతనాల్లో కోత, అదనపు పని ఒత్తిడితో కింది స్థాయి ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఉన్నతాధికారులు నాయకుల మెప్పు కోసం తమను బలి చేస్తున్నారని అక్రోశం వ్యక్తం చేస్తున్నారు.