Andhrapradesh

AP Pension Hike : జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు, జీవోలో లేని 50 ఏళ్లకే పెన్షన్ అంశం

Published

on

AP Pension Hike : ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంచుతూ జీవో నంబర్ 43ని విడుదల చేసింది. అయితే అందులో ఎన్నికల వాగ్దానం బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అంశం మాత్రం అందులో పేర్కొనలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మొదటి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంపునకు సంబంధించిన ఫైల్ పై మూడో సంతకం చేశారు. దీంతో సీఎస్ నీరభ్ కుమార్ అధికారిక ‌ఉత్తర్వులు ఇచ్చారు. జీవో నంబర్ 43ని విడుదల చేశారు‌. దీనిని వెంటనే అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వులను పంపించారు. ఈ ఉత్తర్వులు గవర్నర్ పేరు మీదుగా విడుదల చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ పేర్కొన్నారు.

దీంతో రాష్ట్రంలో పెన్షన్ దారులకు శుభవార్త వచ్చింది. గత ప్రభుత్వం రూ.3,000 పెన్షన్ ఇస్తే దాన్ని రూ.4,000కి పెంచింది. అలాగే గత మూడు నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా రూ.1,000 చొప్పున, జులైలో నెల రూ.4,000, గత మూడు నెలల రూ.3,000 మొత్తం రూ.7,000 ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

11 కేటగిరీల్లో పెన్షన్ రూ.3,000 నుంచి రూ.4,000కు పెంపు
మొత్తం 11 కేటగిరీల్లో పెన్షన్ రూ.3,000 నుంచి రూ.4,000కు పెంచారు. పెన్షన్ లబ్ధిదారులు అయిన వృద్ధాప్య, వితంతువులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్ జెండర్, హెచ్ఐవీ (PLHIV)తో జీవిస్తున్న వ్యక్తులలో యాంటీరెట్రో వైరల్ థెరపీ ఉన్నవారికి, డప్పు కళాకారులకు, కళాకారులకు ఇలా కేటగిరీల్లో పెన్షన్ రూ.3,000 నుంచి 4,000కు పెంచారు.

రెండు కేటగిరీల్లో రూ.3,000 నుంచి రూ.6,000 పెన్షన్
రెండు కేటగిరీల్లో పెన్షన్ రూ.3,000 నుంచి రూ. 6,000కు పెంచారు. వికలాంగులకు, మల్టీడిఫార్మిటీ లెప్రసీలకు పెన్షన్ రూ.3,000 నుంచి రూ.6,000కు పెంచారు.‌

రెండు కేటగిరీల్లో రూ. 5,000 నుంచి రూ.15,000 పెన్షన్
రెండు కేటగిరీల్లో పెన్షన్ రూ.5,000 నుంచి రూ. 15,000కు పెంచారు. పూర్తి స్థాయి (వీల్ చైర్, బెడ్ కే పరిమితం అయిన) పక్షవాతంతో ఉన్నవారికి, తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు, ప్రమాద బాధితులు పెన్షన్ రూ.5,000 నుంచి రూ.15,000కు పెంచారు.‌

Advertisement

ఐదు కేటగిరీల్లో రూ.5,000 నుంచి రూ.10,000కి పెంపు
కిడ్నీ, తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఐదు కేటగిరీల్లో రూ.5,000 నుంచి రూ.10,000కి పెంచారు. ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్-గ్రేడ్ 4, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి, సీకేడీయూ డయాలసిస్‌పై కాదు సీకేడీ సీరం క్రియేటినిన్> 5mg, సికేడీయూ డయాలసిస్‌పై కాదు సికేడీ అంచనా వేసిన జీఎఫ్ఆర్ <15 ml, సీకెడీయూ డయాలసిస్‌పై కాదు సీకెడీ చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ రోగులకు పెన్షన్ రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచారు. ఎనిమిది కేటగిరీలకు పెంపు‌ లేదు
పెన్షన్ రూ.500 నుంచి రూ.10,000 వస్తున్న ఎనిమిది కేటగిరీల్లో పెంపు లేదు. రూ.10 వేల పెన్షన్ తీసుకుంటున్న సీకేడీయూపై డయాలసిస్ ప్రైవేట్‌, సీకేడీయూపై డయాలసిస్ ప్రభుత్వ, సికిల్ సెల్ వ్యాధి, తలసేమియా, తీవ్రమైన హీమోఫిలియా (<2% కారకం 8 లేదా 9) వారికి, రూ.5,000 పెన్షన్ తీసుకుంటున్న సైనిక్ సంక్షేమ పింఛన్లు, అమరావతి భూమిలేని పేదలు, రూ.500 పెన్షన్ తీసుకుంటున్నా అభయహస్తం పెన్షన్ లో పెంపు లేదు. పెన్షన్ పేరును వైఎస్సార్ భరోసా నుంచి ఎన్టీఆర్ భరోసాగా మార్చారు.‌ రూ.3,000 నుంచి రూ.4,000 పెన్షన్ పెంచడంతో 66 లక్షల మందికి లబ్ధి జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version