Andhrapradesh

AP News: కూటమి కలిపిన బంధం.. ఒక్కటైన నల్లారి కుటుంబం..

Published

on

రాజకీయం ఆ అన్నదమ్ముల మధ్య 7 ఏళ్లుగా మాటలు లేకుండా చేసింది. సొంత ఇంటికి కూడా అన్న అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఆ రాజకీయమే అన్నదమ్ములిద్దరినీ కలిపింది. అన్నదమ్ముల అనుబంధాన్ని పొత్తుల రాజకీయం ఏకం చేసింది. నల్లారి కుటుంబం. చిత్తూరు జిల్లా పాలిటిక్స్‎లో పరిచయం అవసరంలేని ఫ్యామిలీ. 5 దశాబ్దాలకుపైగా ఏపీ పాలిటిక్స్‎లో ఉన్న నల్లారి కుటుంబానికి ముందు నుంచి కాంగ్రెస్‎తోనే అనుబంధం కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‎కు సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. 2014 ఎన్నికల తర్వాత పాలిటిక్స్‎కు దూరంగా ఉండిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పీలేరు అసెంబ్లీకి పోటీ పడ్డ నల్లారి కిషోర్ 2017లో టిడిపి తీర్థం పుచ్చుకోవడం నల్లారి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గ్యాప్‎కు కారణం అయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఓడిపోగా కిరణ్ సొంతూరు ముఖం చూడడం మానేశాడు. తమ్ముడు టిడిపి కొనసాగుతుండగా కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‎లో చేరి పోవడంతో అన్నదమ్ముల మధ్య అనుబంధం దాదాపు తెగిపోయింది.

కలికిరి మండలం నగిరిపల్లిలోని సొంతింటిలో అడుగుపెట్టడం ఇష్టం లేని కిరణ్ ఎప్పుడు కలికిరికి వచ్చినా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే తల దాచుకోవాల్సివచ్చింది. అలాగే అనుచరులతో భేటీ కూడా అక్కడే అవ్వాల్సి వచ్చింది. దీంతో సొంత గ్రామంలో ఇంటి నిర్మాణాన్ని ఏడాది క్రితం ప్రారంభించిన కిరణ్ 10 ఏళ్ల తర్వాత ఏపీ పాలిటిక్స్‎లో రీ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్‎ను వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా రాజంపేట నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోని నగరిపల్లికి రాజంపేట బిజెపి అభ్యర్థిగా అడుగు పెట్టారు. దాదాపు ఏడేళ్ల తర్వాత సొంత ఇంట్లో ముఖాముఖి నిర్వహించారు. ఆ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

గత కొన్నేళ్లుగా గ్రామానికి వచ్చిన ప్రతిసారి కలికిరి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే కిరణ్ బస చేయడం తమ అనుచరులు జీర్ణించుకోలేక పోయారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత తమ్ముడు పీలేరు టిడిపి అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో తమ్ముడు కిషోర్ పీలేరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా, కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ పడటంతో ఒక్కటయ్యారు. అన్నదమ్ములు ఇద్దరూ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగడంతో ఇదే తొలిసారి కావడంతో అక్కడి రాజకీయం ఆసక్తిగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version