Andhrapradesh

AP Mega DSC Notification 2024: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ! త్వరలో నోటిఫికేషన్‌

Published

on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గురువారం (జూన్ 13) బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలో కొలువు తీరిన చంద్రబాబు సర్కార్‌ తొలిరోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. తొలిసంతకం మెగా డీఎస్సీపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గత సర్కార్‌ వెలువరించిన పాత డీఎస్సీని బాబు సర్కార్‌ రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. డీఎస్సీ ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్‌, దరఖాస్తు, పరీక్ష తేదీలు వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా 2024 ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్‌ కారణంగా అది వాయిదా పడింది.

కేటగిరిల వారీగా పోస్టుల వివరాలు ఇలా.. మొత్తం ఖాళీలు 16,347

  • సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్‌జీటీ) పోస్టులు: 6,371
  • పీఈటీ పోస్టులు: 132
  • స్కూల్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు: 7725
  • టీజీటీ పోస్టులు: 1781
  • పీజీటీ పోస్టులు: 286
  • ప్రిన్సిపల్స్‌ పోస్టులు: 52
  • ఐదు కీలక సంతకాలు చేసిన సీఎం చంద్రబాబు..
    గురువారం సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 5 అంశాల అమలుపై సంతకాలు చేశారు. వాటిల్లో మొదటిది.. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ కల నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ ప్రకటన విడుదల చేసేందుకు తొలి సంతకం చేశారు. రెండోది ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు ఫైల్‌పై భూ వివాదాల బాధితులు, రైతుల సమక్షంలో రెండో సంతకం పెట్టారు. సామాజిక భద్రత పింఛన్లను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేశారు. యువతలో నైపుణ్యాలు పెంచి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు స్కిల్‌ సెన్సస్‌పై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరిస్తూ ఐదో సంతకం చేశారు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Trending

    Exit mobile version