Andhrapradesh

AP HC Stay On EC Orders: నేడు డిబిటి పథకాలకు నగదు చెల్లింపు, ఈసీ ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు

Published

on

AP HC Stay On EC Orders: పోలింగ్ పూర్తయ్యే వరకు నగదు బదిలీ పథకాలు నిలిపివేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విపక్షాల ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ నిలిపివేసిన నగదు బదిలీ పథకాలకు సంబంధించిన నిధులను లబ్దిదారులకు శుక్రవారం పంపిణీ చేయాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

ఎన్నికలు పూర్తయ్యే వరకు నిధులు పంపిణీ చేయొద్దని ఈసీ జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం 10వ తేదీన నిధుల పంపిణీకి అనుమతించింది. మే 11 -13 మధ్య కాలంలో మాత్రం నిధులు విడుదల చేయొద్దని ఆదేశించింది.

సంక్షేమ పథకాల్లో భాగంగా నిధుల విడుదల అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం హైకోర్టు చేయొద్దని స్పష్టం చేసింది. .ఈ మేరకు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి, ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా వేశారు.

రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, విద్య దీవెన పథకాల కింద మంజూరు చేసిన రూ.14,165 కోట్ల రుపాయలను లబ్దిదారులకు మంజూరు చేసేందుకు హైకోర్టు అనుమతించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మే 10వ తేదీ శుక్రవారం వరకు నిలిపివేసింది. మే 11 నుంచి 13వ తేదీ వరకు నిధుల పంపిణీ చేయకూడదని స్పష్టం చేసింది. నిధుల పంపిణీ అంశంపై ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఏపీలో వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా లబ్దిదారులకు నిధుల పంపిణీ విషయంలో రాజకీయ పార్టీలు నగదు బదిలీ చేయకుండా చూడాలని ఈసీని అభ్యర్థించాయి. ఈ వ్యవహారంపై ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత జస్టిస్ కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న విద్యాదీవెన, ఈబీసీ నేస్తం పథకాలకు నగదు పంపిణీని ఎన్నికలు పూర్తయ్యే వరకు చేపట్టొద్దని ఈసీ ఆదేశించడానికి సవాలు చేస్తూ రైతులు, మహిళలు, విద్యార్ధులు, వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అయా పథకాలకు తక్షణమే నిధులు మంజూరు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కృష్ణమోహన్ నిధుల పంపిణీ అవసరాన్ని వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయాలని దానిపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఈసీని ఆదేశించారు. ఈ పిటిషన్లపై గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన పరిగణలోకి తీసుకుని పోలింగ్ పూర్తయ్యే వరకు నగదు పంపిణీ ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు ఈసీ తరపు న్యాయవాది అవినాష్ దేశాయ్ చెప్పారు.నిధుల పంపిణీ జరిగితే ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుందని అభ్యంతరం చెప్పారు.

పాత పథకాలనేనని వాదనలు…
పిటిషనర్ల తరపున వాదించిన సీవీ మోహన్ రెడ్డి వివిధ పథకాల కింద రైతులు, మహిళలు, విద్యార్ధులకు ఇచ్చిన నిధులు కొత్త పథకాలేమి కాదని, ఇప్పటికే కొనసాగుతున్న పథకాలని వివరించారు. ప్రభుత్వ బాధ్యతలో భాగమే తప్ప ఓటర్లను ప్రభావితం చేయడం కాదన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పసుపు, కుంకుమ నిధుల పంపిణీకి కోర్టు అనుమతించిన విషయం గుర్తు చేశారు. ఎన్నికల నియమావళి రాకముందే అమలవుతున్నందున అనుమతించారని గుర్తు చేశారు.

పసుపు కుంకుమ పథకంపై ప్రచారం చేయకుండా చూడాలని అప్పటి ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశించినట్టు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి రాకముందే అమల్లో ఉన్న పథకాల అమలుకు అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. పథకాలను అమల్లో ఉన్న వాటికా ఈసీ గుర్తిస్తూనే నగదు పంపిణీ అడ్డుకుంటోందని వాదించారు. పసుపు కుంకుమ పథకం అమలును అడ్డుకోవాలని ఈసీకి అప్పట్లో వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు.

పిటిషనర్ల వాదనలపై ఈసీ తరపున న్యాయవాది అవినాష్ దేశా‍్ అభ్యంతరం చెప్పారు. పోలింగ్ పూర్తయ్యే వరకు నిధుల పంపిణీ ఆపడం వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే మిగిలిన వారి అవకాశాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. నిధుల పంపిణీతో ఓటర్ల ప్రభావితం అవుతారన్నారు.

Advertisement

ఎన్నికల ప్రవర్తన నియమావళి పాత పథకాలతో పాటు కొత్త వాటికి వర్తిస్తుందని, ఎన్నికలకు మూడు రోజుల ముందు నిధుల పంపిణీ సరికాదన్నారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా నిధుల పంపిణీ ఆపాలన్నారు. గురువారం ఉదయం 10.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ అంశంపై వాదనలు జరిగాయి.

ప్రభుత్వ పథకాల నిధులు బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతూందని పిటిషనర్లు వివరించారు. దీని ద్వారా రాజకీయ లబ్ది పొందే అవకాశం లేదని పిటిషనర్లు వాదించారు.ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత రాత్రి పదిన్నర తీర్పు వెలువరించారు. వెంటనే అడ్వాన్స్ తీర్పు కాపీని విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version