Andhrapradesh

AP Govt Teachers : అమెరికా తరహా విధానం ఏపీలో, ఏడాదిలో రెండు సార్లు విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు- విద్యాశాఖ జీవో జారీ

Published

on

AP Govt Teachers : రాష్ట్రంలో విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు, లెక్చరర్లు తప్పనిసరిగా వెళ్లాల్సిందే. ‌అది కూడా ఏడాదిలో రెండు సార్లు వెళ్లాల్సి వస్తుంది. అందుకనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నేతలు స్పందించాల్సి ఉంది. అందుకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు, లెక్చరర్లు సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.‌ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల ఇళ్లను ఏడాదిలో రెండు సార్లు ఉపాధ్యాయులు, లెక్చరర్లు సందర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

గృహ సందర్శన
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం పేరు కూడా పెట్టింది. ‌”తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల గృహ సందర్శన” కార్యక్రమం పేరుతో దీన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జీవో నంబర్ 26ను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని 2024-25 విద్యా సంవత్సరం అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు ప్రతి సంవత్సరం జూన్‌లో మొదటిసారి, అలాగే జనవరిలో రెండో‌సారి విద్యార్థుల ఇళ్లను‌ సందర్శించాలని జీవోలో పేర్కొన్నారు. మొదటిసారి జూన్‌లో విద్యార్థి ఇళ్లను‌ సందర్శించే సమయంలో ప్రతి విద్యార్థికి వ్యక్తిగత వార్షిక విద్యా ప్రణాళికను రూపొందించాలని తెలిపారు.

అమెరికా, ఆస్ట్రేలియాలలో అమలు
అర్ధ సంవత్సరం పరీక్షల తరువాత మళ్లీ జనవరిలో రెండోసారి విద్యార్థుల ఇళ్లను సందర్శించేటప్పడు, విద్యార్థుల పురోగతిపై చర్చించాలని సూచించారు. అప్పుడు వ్యక్తిగత వార్షిక విద్యా ప్రణాళికలోని కోర్సులో‌ అవసరమైన సవరణలు చేయాలని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమం అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని ప్రభుత్వ పాఠాశాలల్లో అమలులో ఉంది. అక్కడ ఈ కార్యక్రమం విజయవంతమైందని‌ పేర్కొన్నారు. విద్యార్థి ఇళ్లను సందర్శించడంతో ఉపాధ్యాయులతో తల్లిదండ్రులకు నమ్మకమైన సంబంధం ఏర్పడుతుందని, వారి పిల్లల విద్యలో పాలుపంచుకునేలా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో విద్యార్థుల హాజరు, ప్రవర్తన, అభ్యాసంలో మెరుగుదలకు దారి తీస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version