Andhrapradesh

ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ ఆహ్వానం – ఎన్నికల వరాలు..???

Published

on

ఏపీలో పెండింగ్ హామీల కోసం ఉద్యమం దిశగా ఉద్యోగ సంఘాలు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం నుంచి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది..

ఉద్యోగుల ఆందోళన : ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయంగా.. పాలనా పరంగా వరుస నిర్ణయాల ప్రకటనకు సిద్దమవుతోంది. ఏపీలో ఉద్యోగుల సమస్యల సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాలేదు. దీంతో, పలు సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పైన హామీలు ఇస్తున్నారు కానీ, అమలు చేయటం లేదంటూ ఉద్యోగ సంఘాల నేతలు నిరసనకు సిద్దం అవుతున్నారు. దీంతో, ప్రభుత్వం అలర్ట్ అయింది. చర్చలకు ఆహ్వానించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాలతో రేపు (సోమవారం) చర్చలకు సిద్దమైంది. గతంలో ఇచ్చిన హామీల అమలు గురించి ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

 

నిరసనల దిశగా : ఉద్యోగులకు డీఏలతో పాటుగా బకాయిలు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంది. గతంలో జరిగిన చర్చల ద్వారా ఆర్దికేతర అంశాలను ప్రభుత్వం పరిష్కరించింది. ఆర్దిక పరమైన అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. దీంతో, ఈ బకాయిల పైన ఉద్యోగ సంఘాలు పట్టు బడుతున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న సమాచారం మేరకు దాదాపు రూ 6,700 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. సరెండర్ లీవుల నగదుతో పాటుగా ఇతర బకాయిలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని వాపోతున్నారు. ఇక, ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా తమ సమస్యలను పరిష్కరించుకొనేందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించేందుకు సంఘాలు సిద్దమయ్యాయి.

 

Advertisement

ప్రభుత్వం చర్చలు : దీంతో, ఇప్పుడు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించటం ద్వారా వీటి పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. పెండింగ్ బకాయిల పైన గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఎంత మేర వెంటనే చెల్లిస్తారనే అంశం పైన క్లారిటీ వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా చూస్తున్నాయి. దీంతో పాటుగా పీఆర్సీ ప్రకటించినా ఇప్పటి వరకు అధ్యయనం ప్రారంభం కాలేదని ఉద్యోగ నేతలు చెబుతున్నారు. పీఆర్సీ నివేదిక, అమలుకు సమయం పట్టనుంది. దీంతో, ఉద్యోగులకు ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పెండింగ్ డీఏలు, బకాయిలు, మధ్యంతర భృతిపైన ఈ చర్చల్లో ప్రభుత్వం వెల్లడించే నిర్ణయం పైన ఉద్యోగులు ఆసక్తిగా చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version