Andhrapradesh
AP Exit Polls 2024 : కూటమి వర్సెస్ వైసీపీ – ఏకపక్షం మాత్రం కాదు..! ఈసారి ‘ఏపీ’ ఎవరిది..?
AP Exit Polls 2024 : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సింగిల్ గా పోటీ చేసిన జగన్…. మరోసారి విక్టరీ కొడుతారా..? లేక కూటమి పాగా వేస్తుందా..? అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉంది. పోలింగ్ జరిగిన నాటి నుంచి కూడా ఫలితాలపై ఎవరికి వారుగా అంచనాలు వేసుకుంటున్నారు.
ఓవైపు అధికార పార్టీ ఈసారి కూడా తమమే విజయం అని చెబుతూ వస్తోంది. మరోవైపు కూటమిలోని నేతలు మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు. ఎవరి లెక్కలు వారికి ఉండగా… శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మాత్రం….కాస్త భిన్నంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో(2019) మాదిరిగా ఏకపక్షంగా మాత్రం ఉండే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఒక పక్షం గెలిచినా… మరోపక్షం కూడా బలమైన ప్రత్యర్థిగానే ఉంటుందన్న విషయాన్ని వ్యక్తపరిచాయి.
లోక్ సభ స్థానాల్లో చూస్తే….
ఏపీలో జరిగిన పోలింగ్ పై శనివారం సాయంత్రం పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశాయి. ఏపీలోని 25 లోక్ సభ సీట్లలో మెజార్టీ స్థానాలు ఎన్డీయే కూటమి గెలిచే అవకాశం ఉందని పలు సంస్థలు తెలిపారు. News 18 Mega Exit Pol ఎగ్జిట్ పోల్స్ ప్రకారం… ఏపీలో 19 – 22 స్థానాల్లో కూటమి పాగా వేస్తుందని, కేవలం 5- 8 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని అంచనా వేసింది.
ఇక ఏబీసీ సీ- ఓటర్ సర్వే చూస్తే…. మెజార్టీ సీట్లు కూటమి గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఏకంగా 21 -25 స్థానాలను గెలుస్తుందని, వైసీపీకి 0- 4 స్థానాలు మాత్రమే దక్కొచ్చని అభిప్రాయపడింది. India Today – Axis My India ప్రకారం… టీడీపీ 13- 15, బీజేపీ 4 -6, వైసీపీకి 2 -4 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. అయితే జన్ కీ బాత్ సర్వే ప్రకారం…. వైసీపీ 08 -13 సీట్లలో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక కూటమి 10- 14 స్థానాల్లో గెలవొచ్చని అంచనా వేసింది.
India TV – CNX ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లోనూ కూటమిదే హవా అని తెలిపింది.Times Now ETG Research ఎగ్జిట్ పోల్స్ ప్రకారం… వైసీపీకి 14 సీట్లు దక్కొచ్చని తెలిపింది. ఎన్డీయే కూటమికి 11 సీట్లు రావొచ్చని అంచనా వేసింది.
అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్….
లోక్ సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పోల్చితే… అసెంబ్లీ ఫలితాల ఎగ్జిట్స్ పోల్స్ కాస్త భిన్నంగానే కనిపించాయి. పీపుల్స్ పల్స్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…. టీడీపీకి సంపూర్ణ మెజార్టీ దక్కనుంది. వైసీపీ కేవలం 45-60 సీట్ల మధ్యనే ఆగిపోతుందని అంచనా వేసింది.ఆరా మస్తాన్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం… వైసీపీ 94-104 సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఎన్డీఏ 71-81 సీట్లలో పాగా వేస్తుందని పేర్కొంది. పోల్ స్ట్రాటజీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం… వైసీపీ 115 -125 సీట్లు, కూటమి – 50-60 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. రైజ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే… కూటమికి వంద సీట్లు దాటుతాయని తెలపగా,,,వైసీపీకి 48 – 60 సీట్లు దక్కొచ్చని పేర్కొంది.
మే 13న జరిగిన పోలింగ్ ఆధారంగా పలు సంస్థలు ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కూటమి, వైసీపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. మొత్తంగా చూస్తే లోక్ సభ ఫలితాల్లో మెజార్టీ సంస్థలు కూటమి వైపు ఎక్కువ మొగ్గు చూపినట్లు కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాత్రమే…. అంచనాకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. వైసీపీ, కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉండేలా కనిపిస్తోంది.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికారంలోకి రావాలంటే 88 దాటాల్సి ఉంటుంది. 2019లో వైసీపీ ఏకంగా 151 స్ఖానాల్లో గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈసారి వచ్చే ఫలితాలు మాత్రం… ఏకపక్షంగా మాత్రం ఉండేలా కనిపించటం లేదు. ఒక పక్షం అధికారంలోకి వచ్చినప్పటికీ… ప్రతిపక్షం కూడా మెరుగైన సీట్లలో గెలిచిన బలమైన పక్షంగా ఉండటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనా మాత్రమే. కొన్ని సందర్భాల్లో ఈ అంచనాలు తారుమారు కావొచ్చు. చాలా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారైన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు నిజం కూడా అయ్యాయి. అయితే తుది ఫలితాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది…!