Andhrapradesh
AP BJP 11th Seat: 11వ సీటు అడుగుతున్న బీజేపీ.. ఎక్కడ నుంచి.. ఎవరి కోసం..?
నిన్నటి వరకు ఒక ఎత్తు.. ఇవాళ్టి నుంచి మరో ఎత్తు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ తీరు. 10 కాదు 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజా పరిణామాల నేపథ్యంలో సీట్లపై పునఃసమీక్ష తప్పదా అన్న చర్చ మొదలైంది. మరోవైపు నలుగురు సీనియర్లు అమరావతి సమావేశానికి డుమ్మా కొట్టడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో లాస్ట్ ఫేజ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ముఖ్యంగా ఎన్డీయే కూటమి పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తలనొప్పిగా తయారవుతోంది. ప్రకటించాల్సి ఉన్న సీట్లు కొన్నే అయినప్పటికీ.. ఆ సీట్ల వ్యవహారమే ఇప్పుడు కూటమి పార్టీలకు చాలెంజ్‌గా మారాయి. ఇక, పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీకి అంగీకరించిన బీజేపీ.. తాజాగా మరో సీటుపై కన్నేయడం చర్చనీయాంశం అవుతోంది. కమలం పార్టీలో ఏం జరిగిందో గానీ.. పది కాదు.. 11 అసెంబ్లీ సీట్లు కావాలని పట్టుబడుతున్నారు ఆ పార్టీ నేతలు. దాంతో.. బీజేపీకి మరో సీటు తప్పక కేటాయించాల్సి వస్తే జనసేన, టీడీపీలో ఎవరు త్యాగం చేయబోతున్నారన్న చర్చ మొదలైంది.
వాస్తవానికి.. పొత్తులో 21 సీట్లు దక్కించుకున్న జనసేనకు పి.గన్నవరం అదనంగా కలిసివచ్చింది. దాంతో.. కూటమి లెక్కల ప్రకారం జనసేనకు ఒక సీటు ప్లస్ అయింది. ఈ క్రమంలో.. ఇప్పటివరకు జనసేన పోటీ చేసే 18 చోట్ల క్లారిటీ రాగా.. మరో మూడు అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. టీడీపీ నుంచి ఏడు అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అటు.. బీజేపీ నుంచి పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేకుండా పోయింది. పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చాలా చోట్ల టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇలాంటి సమయంలో కూటమి ఒప్పందంలో కేటాయించిన 10 ఎమ్మెల్యే స్థానాలతోపాటు మరోటి బీజేపీ అదనంగా కోరుతుండడం కూటమిలో కాక రేపుతోంది. పాలకొండ, అవనిగడ్డ, విశాఖ సౌత్ జనసేనకు కేటాయించినా ఇప్పటివరకు ఆయా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో.. బీజేపీ మెట్టు దిగని పక్షంలో ఆ మూడింటలో ఒక స్థానం త్యాగం చేయాల్సి రావొచ్చు. కానీ.. జనసేన సీటు కోల్పోయినా టీడీపీకే నష్టం అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ లెక్కన.. కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీనే ఒక సీటు లాస్ కావాల్సి వస్తోంది.
ఇదిలావుంటే.. అభ్యర్థులప్రకటన చివరిదశలో ఉండగా.. బీజేపీ.. సడెన్‌గా ఒక సీటు ఎక్స్‌ట్రా ఎందుకు అడుగుతోంది.. అన్నది కూడా చర్చకు దారి తీస్తోంది. అసలు.. బీజేపీ కోరుతున్న సీటు ఎవరి కోసం?.. ఆ 11వ స్థానం ఎక్కడ నుంచి ఆశిస్తోంది?.. అనే ప్రశ్నలు సైతం తెరపైకి వస్తున్నాయి. అయితే.. బీజేపీలో ముగ్గురు, నలుగురు సీనియర్లకు టిక్కెట్లు దక్కలేదు. ఆయా నేతలు బీజేపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే.. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఒక సీటు ఇస్తే.. దాన్ని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజుకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
దాంతోపాటు.. అనపర్తికి బదులు రాజంపేట సీటును కూడా బీజేపీ నేతలు కోరుతున్నట్లు ప్రచారం జరగుతోంది. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ అదనంగా కోరుతున్న సీటును టీడీపీ, జనసేనలో ఎవరో ఒకరు ఖచ్చితంగా త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే.. జనసేన సీట్లు 24 నుంచి 21కి తగ్గాయి. కూటమి కోసం మూడు స్థానాలను జనసేన పార్టీ వదులుకుంది. అనుకోని పరిస్థితుల్లో పి.గన్నవరం అదనంగా వచ్చి చేరింది. అయితే.. అదనంగా వచ్చిన ఆ సీటు.. బీజేపీ కోసం ఎక్కడ త్యాగం చేయాల్సి వస్తుందోన్న భయం మళ్లీ జనసేన పార్టీ ఆశావహులను వెంటాడుతోంది.
మొత్తంగా… 11వ సీటు కోసం బీజేపీ పట్టుబడుతుండడం కూటమి పార్టీల్లో కొత్త గందరగోళానికి దారి తీస్తోంది. కమలం పార్టీ కొత్త లిటిగేషన్‌తో జనసేన, టీడీపీ పార్టీల్లో ఎవరు సీటు త్యాగం చేయాల్సి వస్తుందో.. ఎక్కడ సీటు ఇవ్వాల్సి వస్తుందో.. ఆ స్థానంలో ఎవరు పోటీ చేస్తారో.. చూడాలి మరి..!