Business
దివాలా అంచుకు మరో బ్యాంక్.. RBI ఆంక్షలు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి? ఎలాంటి హక్కులుంటాయి?
RBI: దేశంలోని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వంటి ఫైనాన్స్ సంస్థలపై రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి నిఘా పెట్టింది. నిబంధనల ఉల్లంఘనలు, ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతున్న బ్యాంకులపై ఆంక్షలు విధిస్తోంది. వాటిని దారికి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. తాజాగా దివాలా అంచుకు చేరిన మరో బ్యాంకుపై ఆంక్షలు విధించింది ఆర్‌బీఐ. అదే కోనార్క్ అర్బణ్ కోఆపరేటివ్ బ్యాంక్. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్ కేంద్రంగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న ఈ బ్యాంకు ఆర్థిక పరిస్థితి దిగజారిన క్రమంలో నగదు విత్ డ్రా సహా పలు ఆంక్షలు విధించింది. ఆ వివరాలు ఓసారి తెలుసుకుందాం.
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35ఏ కింద ఈ ఆంక్షలు విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. కోనార్క్ అర్బణ్ కోఆపరేటివ్ బ్యాంక్ పై ఆంక్షలు ఏప్రిల్ 23, 2024 నుంచే అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో ఈ బ్యాంక్ ఇకపై కొత్త రుణాలు లేదా లోన్ రెన్యువల్ చేయడం కుదరదు. అలాగే ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు. అలాగే ఎలాంటి లయబిలిటీ ట్రాన్స్‌ఫర్ చేయడం లేదా ఏ ప్రాపర్టీని రద్దు చేయడం వంటివి చేయరాదు. పైన చెప్పిన ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం బ్యాంక్ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని.. ప్రస్తుతానికి సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, లేదా ఇతర ఖాతాల్లోని బ్యాలెన్స్ నుంచి ఎలాంటి విత్ డ్రా చేయడానికి లేదు. అయితే, లోన్ సెటిల్మెంట్ చేసేందుకు అనుమతి ఉంది. అయితే, ఈ ఆంక్షలు అనేవి బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయాలనే ఉద్దేశంతో మాత్రం విధించినవి కాదని గుర్తుంచుకోవాలి. ఆర్థిక పరిస్థి మెరుగుపడే వరకు బ్యాంక్ ఈ ఆంక్షలతోనే బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది.’ అని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
బ్యాంక్ దివాలా తీస్తే ఖాతాదారుల పరిస్థితి ఏంటి?
బ్యాంకుల ఆర్థిక పరిస్థితి క్షీణించిన సందర్భంలో ఆర్‌బీఐ ఆంక్షలు విధించడం లేదా లైసెన్స్ రద్దు చేస్తుంటుంది. అయితే ఇలాంటి సందర్భాలో ఖాతాదారులు తమ డబ్బును కోల్పోతామనే ఆందోళన ఉంటుంది. అయితే, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది. అర్హత కలిగిన బ్యాంక్ ఖాతాదారులు రూ. 5 లక్షల వరకు ఈ బీమా కవరేజీ పొందవచ్చు. బ్యాంకులోని అన్ని ఖాతాల్లో కలిపి రూ. 5 లక్షల వరకు పొందుతారు. అయితే, ఆపైన ఉంటే మాత్రం నష్టపోవాల్సి వస్తుంది.