Spiritual
అంగరంగ వైభవంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. స్వామివారి నిజరూప దర్శనం
Simhadri Appanna Chandanotsavam : సింహాచల క్షేత్రంలో పశ్చిమాభిముఖుడై వెలసిన వరాహ నృసింహస్వామి విజయ ప్రదాతకు వైశాఖ శుద్ధ తుదియనాడు చందనసేన జరుగుతుంది. చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని, భక్తులపై చల్లని చూపులను ప్రసరింపచేసే దువుడు సిహాంద్రి అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అనువంశీక ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వేదమంత్రాల నడుమ వేకువజామున 3గంటలకు పూసపాటి కుటుంబ సభ్యులు అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం 5గంటల వరకు భక్తులకు నిజరూపంలో అప్పన్న స్వామి దర్శనమివ్వనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రోట్రాకాల్ దర్శనాలు రద్దు చేశారు. పరిమిత సంఖ్యలో ఉన్నతాధికారులు, న్యాయమూర్తులకు దర్శన ప్రాధాన్యం కల్పించారు. గతేడాది వైఫల్యం నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ.. స్వామివారి దర్శనంకోసం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, క్యూ లైన్లలో భక్తులకు వాటర్, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నామని అన్నారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతోపాటు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. వచ్చినవారిని వచ్చినట్లే స్వామివారి దర్శనానికి పంపిస్తున్నామని చెప్పారు.