International
అమెరికాకు తప్పిన షట్ డౌన్ ముప్పు! నిధుల బిల్లుకు చివరి క్షణంలో ఆమోదం – US SHUTDOWN 2024
US Shutdown 2024 : అమెరికా షట్‌డౌన్ గండం నుంచి తప్పించుకున్నట్లే కనిపిస్తోంది. ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రిలోగా ఉన్న గడువుకు కొన్ని గంటల ముందు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళికకు ప్రతినిధుల సభ ఆమోదించింది. అయితే, అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేవనెత్తిన డిమాండ్లను ఈ ప్లాన్ నుంచి తొలగించింది. అనంతరం ఈ బిల్లును సెనెట్‌కు పంపింది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తొలగిపోతుంది.
బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన రిపబ్లికన్లు
ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తొలుత ట్రంప్ తిరస్కరించారు. సమాఖ్య ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం సహా వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో రెండేళ్లపాటు రుణాలపై పరిమితిని ఎత్తివేయాలంటూ కోరారు. దీంతో ట్రంప్ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ గురువారం సరికొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, దీన్ని ప్రతినిధుల సభ 235-174తో తిరస్కరించింది. ఏకంగా 38 మంది రిపబ్లికన్ సభ్యులే డెమొక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు.
‘అధికార మార్పిడికి అంతరాయం’
అయితే తాజా పరిణామాలపై వైట్ హౌస్ స్పందించింది. షట్‌డౌన్ వస్తే అధికార మార్పిడికి అంతరాయం కలుగుతుందని వ్యాఖ్యానించింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అటు రిపబ్లికన్ల నుంచే వ్యతిరేకత రావడం వల్ల ఈ బిల్లులో మళ్లీ మార్పులు చేశారు. ట్రంప్ చేసిన డిమాండ్లను తొలగించి సమాఖ్య కార్యకలాపాలకు నిధులు, విపత్తు సహకారం వంటి అంశాలతో 118 పేజీల మరో కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ మైక్ జాన్సన్ శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. దీనికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ బిల్లుకు 366-34తో ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. మెజారిటీ రిపబ్లికన్లు ఈ కొత్త బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. అనంతరం దీన్ని సెనెట్‌కు పంపించారు. ప్రస్తుతం సెనెట్‌లో డెమొక్రాట్లకు ఆధిక్యం ఉంది. దీంతో అక్కడ కూడా బిల్లు సునాయాశంగా ఆమోదం పొందే అవకాశం ఉంది. శుక్రవారం అర్ధరాత్రిలోగా (అమెరికా కాలమానం ప్రకారం) సెనెట్ ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.
ట్రంప్ హయాంలో షట్‌డౌన్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు ప్రభుత్వం మూతపడింది. దేశ చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా నిలిచింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయనుకున్నా ఆఖరి నిమిషంలో అమెరికాకు షట్‌డౌన్ ముప్పు తప్పింది.