National
Ambani wedding: పది కాలాలు కాదు.. అనంత కాలాలు గుర్తుండేలా అంబానీ ఇంట పెళ్లి వేడుకలు
రాధిక-అనంత్‌ల కల్యాణం.. కనులకు వైభోగం!. ప్రస్తుతం ప్రపంచమంతా ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్’ వైపే చూస్తోంది. ఎందుకంటే అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల పెళ్లి వేదిక ఇది. పెళ్లంటే పది కాలాల పాటు గుర్తుంచుకునేలా ఘనంగా జరిపించాలంటారు పెద్దలు. పది కాలాలు కాదు.. అనంత కాలాల పాటు గుర్తుంచుకునేలా అనంత్-రాధికల పెళ్లి వేడుక జరుగుతోంది. భూలోక స్వర్గాన్ని తలపించేలా ఏర్పాట్లు… అతిథులకు విందు, వినోదం!. ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న అతిరథ మహారథులు!
అపర కుబేరుడు అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మాటలా.! ప్రీ వెడ్డింగ్ వేడుకలే ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట వేసినట్టుగా సాగుతున్నాయి. అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసితో వివాహ బంధంలోకి అడుగుపెట్టే ముహూర్తం సమీపిస్తుండటంతో పెళ్లి వేడుకలోని కీలక ఘట్టాలు ఒక్కొక్కటీ వైభవంగా మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా అనంత్ అంబానీ పెళ్లి గురించే మాట్లాడుతోంది. గుజరాతీ వివాహాల్లో తొలుతగా నిర్వహించే ఆచారాలను ఇరు కుటుంబాలు పాటిస్తున్నాయి. ఇందులో భాగంగానే ముంబైలోని యాంటిలియాలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల మామేరు వేడుక ఘనంగా జరిగింది. వరుడి మేనమామలు, వారి కుటుంబ సభ్యులు కలిసి కాబోయే వధూవరులకు కానుకలిచ్చి వారిని ఆశీర్వదించే వేడుకే ఇది!
నీతా అంబానీ పుట్టింటి వారు ‘మామెరు’ వేడుకలో ముఖ్యపాత్ర పోషించారు. నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె చెల్లి మమతా దలాల్ వరుడి ఇంటికి వచ్చి బహుమతులు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే వధువు రాధికా మర్చంట్ మేనమామ కుటుంబ సభ్యులు కూడా కాబోయే దంపతులను ఆశీర్వదించి సంప్రదాయ బహుమతులను అందజేశారు. అనంత్, రాధిక ‘మామెరు’ వేడుక కోసం అంబానీ నివాస భవనం యాంటిలియాను అందంగా తీర్చిదిద్దారు. ఎరుపు, గులాబీ, నారింజ పూలతో అలంకరించారు. దీని అందాన్ని మరింత పెంచేందుకు బంగారు దీపాలు కూడా ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలో అంబానీ ఫ్యామిలీ మొత్తం గుజరాతీ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. మామేరు వేడుకలో రాధిక తన స్టయిలిష్ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంది. ఇషా అంబానీ ఫ్యామిలీ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇషా- ఆనంద్ జంట తమ పిల్లలతో ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. ఇక అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా కూడా అందంగా ముస్తాబై అందరినీ ఆకర్షించింది. ఇక సాధారణంగానే అంబానీ ఇంట పండగైనా, పూజైనా.. తారలంతా ఇక్కడ వాలిపోతారు. అలాంటిది పెళ్లంటే.. వాళ్లు చేసే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా నిర్వహించిన ‘సంగీత్ వేడుక’లో ఇదే రిపీటైంది. కొత్త జంటతో కలిసి అంబానీ ఫ్యామిలీ.. ‘ఓమ్ శాంతి ఓమ్’ సినిమాలోని ‘దీవాంగీ దీవాంగీ’ అనే పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టింది.
అంబానీ ఫ్యామిలీ అంతా డ్యాన్స్ చేయడం ఈ వేడుకలో అన్నింటికన్నా హైలైట్‌గా నిలిచింది. అనంత్ బాలీవుడ్ స్టార్స్‌తో స్టెప్పులేయడం కొసమెరుపు. ఇక గ్లోబల్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ వేడుకలో హైలైట్‌గా నిలిచింది. బీబర్ మైక్ అందుకుని పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ స్పాట్ లైట్ నడుమ ఓ ఊపు ఊపేసాడు. బాలీవుడ్ సెలబ్రిటీలైతే బీబర్ పెర్పార్మెన్స్ కి ఫిదా అయిపోయారు. బాలీవుడ్ సింగర్ బాద్‌షా తన పాటలతో అతిథుల్లో జోష్ నింపాడు. వారితో మమేకమై పాటలు ఆలపించాడు. ఇక ఈ వేడుకలో థీమ్‌కు తగినట్లే మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోయారు కాబోయే వధూవరులు, వారి కుటుంబ సభ్యులు. మరోవైపు అతిథులూ స్టైలిష్ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.
ఈ సంగీత్ వేడుకలో ముంబై ఇండియన్స్ క్రికెటర్లు సందడి చేశారు. టీ20 ప్రపంచ కప్ విజేతలుగా నిలిచిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ముగ్గురిపై అంబానీ ఫ్యామిలీ ప్రశంసల వర్షం కురిపించింది. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కోసం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ ముగ్గురికి గుమ్మడికాయపై కర్పూరం వెలిగించి దిష్టితీశారు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యను సాదరంగా వేదికపైకి ఆహ్వానించిన నీతా అంబానీ.. ఆత్మీయంగా హత్తుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇక ఇప్పటివరకు అనంత్-రాధిక వివాహానికి సంబంధించిన ప్రతి వేడుకలోనూ దేశ సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రతి వేడుక ఘనంగా నిర్వహించింది అంబానీ కుటుంబం. అనంత్- రాధిక వివాహ కార్యక్రమంలో భాగంగా ఈనెల 2న పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించింది. ఈ కొత్త జంటలకు భారీగా కానుకలు అందాయి. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెకు రూ.1.01 లక్షల చెక్ ను అందించారు.
జులై 12న శుభ్ వివాహ్‌తో అనంత్ అంబానీ, రాధిక మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి పెళ్లిపీటలపై అనంత్- రాధిక కూర్చోనున్నారు. జులై 13న శుభ్ ఆశీర్వాద్ వేడుక జరగనుంది. జులై 14న వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు హాజరయ్యే అతిథులందరూ ఇండియన్ చిక్ దుస్తులను ధరించనున్నారు. ఈ వివాహ వేడుకకు సినీ తారలు, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. అనంత్-రాధిక సంగీత్ కార్యక్రమంలో వారి ప్రేమ కథను వర్ణించే నృత్య ప్రదర్శనను చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సంగీత్ కార్యక్రమంలో అనంత్-రాధిక స్నేహితుల నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక ముచ్చట్లు చూస్తున్నా, ఎంత వింటున్నా.. తనివి తీరడం లేదు. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికే కాదు.. ఆహ్వాన పత్రిక కూడా హైలేటే. వీళ్ల పెళ్లికి అంబానీ కుటుంబం ఓ స్పెషల్ వెడ్డింగ్ కార్డును తయారుచేయించారు. అందులో వెండితో చేసిన చిన్న గుడి, అందులో బంగారు విగ్రహం కనిపిస్తున్నాయి. పెళ్లి కార్డుకు సంబంధించిన బాక్స్ తెరవగానే బ్యాక్ గ్రౌండ్‌లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపించేలా ఏర్పాటు చేశారు. ఆలయంలో కాకుండా ఇతర బాక్సుల్లోనే బంగారంతో చేసిన దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి. పెళ్లి కార్డులో వినాయకుడు, శ్రీవిష్ణువు, లక్ష్మీదేవి, రాధా- కృష్ణ, దుర్గాదేవి వంటి దేవుళ్ల చిత్రాలు కనిపిస్తున్నాయి. ఎరుపు, బంగారు వర్ణంలో రూపొందించిన వెడ్డింగ్ కార్డు ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈ వెడ్డింగ్ కార్డును కాశీ విశ్వేశ్వరుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు నీతా అంబానీ. ఆ తర్వాత సన్నిహితులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఆహ్వాన పత్రికలు అందిస్తూ పెళ్లికి పిలుస్తోంది అంబానీ కుటుంబం.