Andhrapradesh
అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. అకౌంట్‌లలోకి డబ్బులు, నెలాఖరుకు పక్కా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రైతుల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గత రెండేళ్లుగా పడుతున్న ఇబ్బందులపై రైతుల కూటమి ప్రభుత్వానికి వరుసగా విన్నవిస్తున్నారు. అమరావతి రైతులకు కౌలు బకాయి రూ.380 కోట్లని తేలగా.. ఆ చెల్లింపుల దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది.. ఈలోపే ప్రభుత్వం డబ్బులు చెల్లించేందుకు సిద్ధహవుతోంది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి రైతులకు శుభవార్త.. రాజధాని రైతులకు చెల్లించాల్సిన కౌలుపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతి రైతుల నుంచి కౌలు చెల్లింపులపై వినతులు వస్తుండటంతో.. మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ కౌలు చెల్లింపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు రాజధాని రైతులకు ప్రభుత్వం రూ.380 కోట్ల మేర కౌలు బకాయిలు ఉన్నట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. కౌలు బకాయిల అంశాన్ని నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి.. నెలాఖరులోగా కౌలు చెల్లించేలా కృషి చేస్తానని మంత్రి నారాయణ అమరావతి రైతు జేఏసీ నేతలు తెలిపారు.
సకాలంలో కౌలు రాకపోవడంతో అప్పులపాలయ్యామని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా కౌలు ప్రస్తావనే లేకుండా చేశారని.. ఇప్పుడు అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు కౌలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. కౌలు చెల్లించకపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. ప్రభుత్వం ఇచ్చే కౌలుతో పిల్లల్ని చదివించుకుంటున్నామంటున్నారు పలువురు పోలీసులు.. ఇప్పుడు వారికి ఫీజులు కట్టే పరిస్థితి లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 28,656 మంది రైతులు దాదాపు 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో కొందరు చిన్న, సన్నకారు రైతులు.. ఆర్థికపరమైన ఇబ్బందులతో రిటర్నబుల్ ప్లాట్లు అమ్ముకున్నారు. ఈ కారణంగా వారంతా కౌలుకు అనర్హులయ్యారు. తాజా లెక్క ప్రకారం 28,656 మందిలో కేవలం 22,980 మందికి మాత్రమే కౌలు వస్తుంది.. వీరిలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులతో పాటుగా.. గిరిజన, దళిత, బీసీ, మైనార్టీ, అసైన్డ్ రైతులే ఉన్నారు. అయితే రైతులకు కౌలు ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు
మరోవైపు అమరావతి రైతులు కౌలు చెల్లింపులపై హైకోర్టును ఆశ్రయించారు. తమకు సకాలంలో కౌలు డబ్బులు చెల్లించేలా చూడాలని కోరారు.. హైకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసింది.. కానీ తమకు మాత్రం కౌలు అందలేదంటున్నారు. రెండేళ్లుగా కౌలు ఎగవేయడంతో అప్పులు చేసినట్లు రైతులు చెబుతున్నారు. కొంతమంది ఈ కౌలు డబ్బులతో పిల్లల్ని చదివిస్తున్నారు. దీంతో ఫీజులు కట్టుకోవడం కూడా వారికి భారంగా మారింది. అందుకే కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కౌలు చెల్లింపులకు సంబందించి కసరత్తు మొదలుపెట్టడంతో.. రైతులు ఆనందంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. అమరావతిలో పనులు కూడా ఊపందుకున్నాయి. ముందుగా ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించింది.. అలాగే పెండింగ్ పనుల్ని కూడా తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు.