News
Amaravati Farmers: తిరుపతికి చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర.. రేపు మొక్కుల చెల్లింపు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు
గత నెల 24న వెంకటపాలెంలో ప్రారంభమైన పాదయాత్ర
17 రోజులపాటు 433 కిలోమీటర్ల ప్రయాణం
నేడు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు రైతులు
అమరావతి రైతుల పాదయాత్ర నిన్న తిరుపతికి చేరుకుంది. నేడు కాలిబాటలో తిరుమలకు చేరుకుని సోమవారం స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీక్ష విరమించిన అమరావతి రైతులు గత నెల 24న అమరావతి వెంకటపాలెం నుంచి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు.
మొత్తం 30 మంది రైతులు 17 రోజులపాటు 433 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిన్న తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి నేడు కాలినడకన తిరుమల చేరుకుంటారు. రేపు (సోమవారం) స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్కటైన అమరావతి రైతులు సంవత్సరాల తరబడి ఉద్యమం చేపట్టారు. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని కూటమి అధికారంలోకి రావడం, అమరావతినే తిరిగి రాజధానిగా ప్రకటించి పనులు ప్రారంభించడంతో రైతులు దీక్ష విరమించారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో ఇటీవల పాదయాత్రగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.