National

Agniveer Scheme: అగ్నివీర్‌లకు గుడ్‌న్యూస్.. ఇక సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఎఫ్‌లలో రిజర్వేషన్లు

Published

on

Agniveer Scheme: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నివీర్ పథకం తీవ్ర వివాదానికి కారణం అయింది. నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ఈ అగ్నివీర్ స్కీమ్‌పై మొదటి నుంచీ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని ఇండియా కూటమి నేతలు బహిరంగంగానే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ అగ్నివీరులకు కేంద్ర పారామిలటరీ బలగాలు సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ గుడ్‌న్యూస్ చెప్పాయి. ఇప్పటినుంచి చేపట్టబోయే కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు సీఐఎస్‌ఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌లు స్పష్టం చేశారు.

కేంద్ర పారామిలటరీ బలగాల్లో సైనిక నియామకాలకు సంబంధించి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ – సీఐఎస్ఎఫ్.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ – బీఎస్‌ఎఫ్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్లలో 10 శాతం ఖాళీలను మాజీ అగ్నివీరులకు రిజర్వ్‌ చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. కేంద్ర హోంశాఖ గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వెల్లడించాయి. కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకం దేశంలో తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ చీఫ్‌లు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మాజీ అగ్నివీరులకు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుందని.. దాని ప్రకారం సీఐఎస్‌ఎఫ్‌ కూడా మాజీ అగ్నివీరులను తమ బలగాల్లోకి తీసుకునేందుకు సిద్ధమవుతోందని సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ నైనా సింగ్‌ తాజాగా వెల్లడించారు. ఇక నుంచి సీఐఎస్ఎఫ్ నిర్వహించే కానిస్టేబుల్‌ నియామకాల్లో 10 శాతం మాజీ అగ్నివీరులకు కేటాయిస్తామని నైనా సింగ్ స్పష్టం చేశారు.

అంతేకాకుండా ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌లలోనూ అగ్నివీరులుగా పనిచేసినవారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. మొదటి ఏడాది 5 ఏళ్లు.. ఆ తర్వాత 3 ఏళ్ల సడలింపు ఇస్తామని చెప్పారు. ఇక మాజీ అగ్నివీరులకు రిజర్వేషన్‌ కల్పించడం వల్ల శిక్షణ పొందిన సిబ్బంది తమ బృందంలో చేరతారని బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ నితిన్‌ అగర్వాల్‌ తెలిపారు. బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్లలో కూడా అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేయనున్నట్లు వెల్లడించారు..

త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి 2022 జూన్‌లో అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 17 నుంచి 21 ఏళల్ వయసు గల యువతీ యువకులు మాత్రమే అగ్నివీర్‌లుగా విధులు నిర్వహించేందుకు అర్హులు అని కేంద్రం వెల్లడించింది. ఎంపికైన తర్వాత 4 ఏళ్లు ముగిసిన అనంతరం వారిని సర్వీస్‌ నుంచి తొలగిస్తారని.. అప్పుడు అగ్నివీర్‌లకు పెన్షన్ సౌకర్యాలు ఉండవని పేర్కొంది. అయితే మొత్తం అగ్నివీరులలో 25 శాతం మందిని మాత్రమే మరో 15 ఏళ్ల పాటు రెగ్యులర్ సర్వీస్‌లో కొనసాగిస్తారు. మిగిలిన 75 శాతం మంది అగ్నివీర్‌లను ఇంటికి పంపించనున్నారు. అయితే ఈ అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version