Andhrapradesh
వయసు మూడేళ్లే – టాలెంట్ చూస్తే సూపర్ అనాల్సిందే – Boy With Amazing Talent
3 Year Old Boy with Amazing Talent: ఆ బాలుడి వయస్సు మూడేళ్లు అతగాడి టాలెంట్ చూస్తే ఎవరైనా ఆహా అనాల్సిందే. తెలుగు నెలల పేర్లు, విజయవాడ ఎంజీ రోడ్డులోని షాపింగ్ మాల్స్ పేర్లు వరుస క్రమంలో చెబుతున్న తీరు చూస్తే అబ్బుర పోవాల్సిందే. ఏడాదిన్నర వయస్సు నుంచే అక్షరాలు, వస్తువులు ,దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పడం గమనించిన తల్లిదండ్రులు బాలుడిని మరింత ప్రోత్సహించారు. కుమారుడి జ్ఞాపకశక్తి పట్ల తల్లితో పాటు కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ లబ్బిపేటకు చెందిన మూడేళ్ల ధృవసాయి జ్ఞాపక శక్తిని చూసి తల్లి హిమజ మురిసిపోతున్నారు. ఏడాదిన్నర వయస్సు నుంచే తమ కుమారుడి టాలెంట్‌ని గుర్తించి ప్రోత్సహిస్తున్నామని ఆమె చెబుతున్నారు. ఈ మూడేళ్ల ధృవసాయి 170 దేశాల జాతీయ పతాకాలను గుర్తిస్తున్నాడు. 32 దేశాలు వాటి రాజధానుల పేర్లు చెప్పి పలువురి నుంచి ప్రశంసలు పొందుతున్నాడు. మన దేశంలోని రాష్ట్రాలు, వాటి రాజధానులను దేశ పఠంలో గుర్తిస్తూన్నాడు. ఈ బాలుడు టాలెంట్ చూస్తే పిట్టకొంచెం కూత ఘనం అన్న సామెతకు సరిగ్గా సరిపోతాడు. ఏదైనా రాష్ట్రం పేరు చెప్పి రాజధాని పేరు అడిగితే టక్కున చెబుతున్నాడు. తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు, అంకెలను గుర్తిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. స్పెల్లింగులు చదువుతూ పదాల పేర్లు చెబుతున్నాడు.
ధృవసాయి తల్లి గృహిణిగా ఉంటూ నిరంతరం కుమారుడు ధృవసాయిని ప్రోత్సహిస్తూ ఉంటారు. తెలుగు, ఇంగ్లీష్ అక్షరాలను గుర్తించడంతో పాటు వస్తువులు, వాహనాలు, కూరగాయలు, ఆకుకూరలు, జంతువులు, వ్యాపార సముదాయ పేర్లు చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. బాలుడి తండ్రి కేఎస్కే. సత్యప్రకాశ్, మహానంది పవర్ ప్రాజెక్టులో ఉద్యోగిగా పని చేస్తున్నారు. తల్లి హిమజ ఇంటి వద్దే ఉంటూ తమ కుమారుడి బాగోగులు చూడడంతో పాటు ధృవసాయికి విద్యపట్ల ఆసక్తిని పెంచుతున్నారు. విద్యతోనే విజ్ఞానం సాధ్యమౌతుందని అందుకే తన కుమారుడికి అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు బాలుడి తల్లి హిమజ చెబుతున్నారు. భవిష్యత్తులో తమ కుమారుడు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.