International

అఫ్గాన్​లో వరద బీభత్సం- 300మందికి పైగా మృతి- వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసం – Afghanistan Floods

Published

on

Floods In Afghanistan : అఫ్గానిస్థాన్​లో సంభవించిన అకస్మిక వరదల వల్ల 300మందికి పైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. వరదలు ధాటికి 1,000 పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని తాలిబన్ల అధికారి ఒకరు తెలిపారు. దాంతో భారీ నష్టం వాటిలినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.

వరదలకు ధ్వంసమై ఇళ్లు (APTN)



వరదలతో నేలమట్టమైన నివాసాలు (APTN)


ఉత్తర అఫ్గానిస్థాన్​పై వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. బగ్లాన్ ప్రావిన్స్​లో భారీ వరదల కారణంగా శుక్రవారం నాటికి 50 మంది ప్రాణాలు కోల్పోయారని తాలిబన్ల అధికారి ఒకరు తెలిపారు. అలాగే బగ్లాన్ ప్రావిన్స్​కు పొరుగున ఉన్న తఖర్ ప్రావిన్స్​లో వరదల ధాటికి 20మంది మరణించారని పేర్కొన్నారు. ‘భారీ వరదల కారణంగా బదాక్షన్, బగ్లాన్, ఘోర్‌, హెరాత్‌ ప్రావిన్సులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ విధ్వంసం భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలిస్తున్నాం. బాధితులను రక్షించడం, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడానికి, వరదల ధాటికి మరణించినవారి మృతదేహాలను వెలికితీసేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది’ అని వెల్లడించారు.

వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు (APTN)


రంగంలోకి వైమానిక దళం
అఫ్గాన్ వైమానిక దళం బాగ్లాన్​లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించడం ప్రారంభించిందని తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అఫ్గాన్ వైమానిక దళం వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించిందని, వందలాది క్షతగాత్రులను సైనిక ఆస్పత్రులకు తరలించిందని పేర్కొంది.

ఏప్రిల్​లోనూ 70మంది మృతి
అఫ్గానిస్థాన్ వాతావరణ పరిస్థితులు కూడా ఈ వరదలకు కారణం అవుతున్నాయి. పొడి వాతావరణం కారణంగా అఫ్గానిస్థాన్ నేలలకు నీటిని పీల్చుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. కొన్నేళ్ల పాటు అంతర్యుద్ధ పరిస్థితుల్లో మగ్గిన అఫ్గాన్​కి ప్రకృతి విపత్తుల వల్ల ఎదురయ్యే పర్యావసానాలను తట్టుకునే సన్నద్ధత చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో అఫ్గాన్‌ లో వరుసగా ప్రకృతి విపత్తులు సంభవిస్తుండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత నెలలోనూ(ఏప్రిల్ లో) వరదలు సంభవించి దాదాపు 70 మంది ప్రాణాలు విడిచారు. అలాగే దాదాపు 2,000 ఇళ్లు, మూడు మసీదులు, నాలుగు పాఠశాలలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version