Andhrapradesh

Actor Ali: వైసీపీ ప్రచారానికి దూరంగా అలీ.. ప్యూచర్ ప్లాన్స్ ఏంటి..?

Published

on

ఏపీ రాజకీయం ఎండలను మించి ఠారెత్తిస్తోంది. నేతల ప్రచారంతో ప్రతీ గల్లీ ఓ రాజకీయ సభను తలపిస్తోంది. నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మరి సీనియర్ రాజకీయ నాయకులు అలీ, పృథ్వీరాజ్‌ ఎక్కడా కనిపించడం లేదే.. అన్న ఆలోచన కొందరిని ఆలోచింపచేస్తోంది. వీళ్లద్దరు ఎక్కడా అంటే టికెట్ దక్కక.. ప్రచారానికి పోలేక షూటింగ్‌లకు పరిమితం అయ్యారట.

అలీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరుఫున ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం సాగింది. అయితే చివరకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవితో అలీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అలీ వైసీపీ నుంచి ఎమ్మెల్యే లేదంటే ఎంపీగా పోటీ చేయడం ఖాయం అనుకున్నారంతా.

మైనార్టీ కోటాలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అలీకే దక్కబోతుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అక్కడ నూరి ఫాతిమాకు అవకాశం ఇచ్చారు సీఎం జగన్. మరో వైపు.. అయితే నంద్యాల లేదంటే రాజ్యసభ ఎంపీగా అలీకి జగన్ అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే అది కూడా దక్కక అలీ షూటింగ్‌లకు పరిమితం అయ్యారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున క్యాంపెయిన్ నిర్వహించి.. ఈసారి ప్రచారానికి దూరంగా ఉన్నారు అలీ.

ఈ పరిణామాల క్రమంలో అలీ వైసీపీలో ఉంటారా లేదా అనే అనుమానాలు కూడా తెర మీదకు వచ్చాయి. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఏపీలో వైసీపీ హవా ఏస్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినీ ఇండస్ట్రీ మాత్రం జగన్ ప్రభుత్వానికి దగ్గర కాలేకపోయింది. ఇందులో ఒక అడుగు ముందుకు వేసిన అలీ జగన్ వెంట నిలిచారు. దీంతో సహజంగానే ఈ ఎన్నికల్లో టికెట్ దక్కబోతుందన్న అంచనాలు వెలువడ్డాయి. కాని చివరికి చేదు అనుభవమే ఎదురైంది.

ఇక మరో నటుడు మాజీ వైసీపీ నేత, ప్రస్తుత జనసేన నేత.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి కూడా చేదు అనుభవం తప్పలేదు. సినిమాల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీని రాజకీయాల్లో 60 ఇయర్స్ ఇండస్ట్రీగా మారుద్దామని అనుకున్నాడు. కాని రాజకీయాల్లో అంత ఈజీ కాదన్నట్లుగా ఉన్నాయి పరిణామాలు. ఈసారి తనకు జనసేన నుంచి టికెట్ దక్కబోతుంది అంటూ ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా ప్రచారం చేశారు పృథ్వీ. జనసేన అధ్యక్షుడి మనస్సు గెలుచుకోవడంలో విజయం సాధించిన పృథ్వీ టికెట్ దక్కించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. జననరి నెలలో ఉభయ గోదావరి జిల్లాల్లో విసృతంగా పర్యటించి వైనాట్ 175 కాదు.. వైసీపీకి 17 సీట్లే వస్తాయంటూ జోస్యం చెప్పారు. రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే అంటూ ప్రకటించారు.

Advertisement

మొత్తానికి ఇద్దరు కమెడియన్లు రాజకీయాల్లో రాణిద్దామని వచ్చి.. పొలిటికల్ కెరీర్‌ను సక్సెస్ చేసుకోలేకపోయారు. మరి ఎన్నికల తర్వాత ఇద్దరి భవిష్యత్ ఏంటన్న దానిపై టాలీవుడ్ సహా ఏపీలో రాజకీయాల్లోనూ చర్చ నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version