National

929 మందిని తొలగించాం – 62,571 మంది వాలంటీర్లు రాజీనామా – హైకోర్టుకు తెలిపిన ఈసీ – High Court On Volunteer Resignation

Published

on

AP High Court on Volunteers Resignations : ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ఉల్లంఘించిన కారణంగా 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తరఫు సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌దేశాయ్‌ హైకోర్టుకు నివేదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 62,571 మంది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారని అన్నారు. మూకుమ్మడి రాజీనామాలకు కారణాలు తెలియవని తెలిపారు. పిటిషనర్‌ కోరిన విధంగా ఎన్నికలు ముగిసే వరకు రాజీనామాలను ఆమోదించవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమని అన్నారు. ఐఏఎస్‌ అధికారులే ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్‌ వేయడానికి సమయం కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

Volunteer Resignation Issue : ఏపీలో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలను ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ భారత ఛైతన్య యువజన పార్టీ(బీసీవైపీ) అధ్యక్షుడు బి. రామచంద్రయాదవ్‌ (Ramachandra Yadav) హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సుమన్‌ వాదనలు వినిపిస్తూ ఈసీ ఆదేశాల నేపథ్యంలో వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించలేదని అన్నారు. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటున్నారని తెలిపారు. అయినా వారికి గౌరవ వేతనం చెల్లిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోందని పేర్కొన్నారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ఈసీపై ఉందని అన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేసి వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్నారు. ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను బైపాస్‌ చేసేందుకు వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో ఈసీ మౌనంగా ఉండటం తగదన్నారు. ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి రాజీనామాలను ఆమోదించొద్దంటూ ఆదేశాలు ఇచ్చే అధికారం ఈసీకి ఉందన్నారు. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వుల కోసం తాను అభ్యర్థించడం లేదన్నారు. ఈసీ కౌంటర్‌ దాఖలు చేశాక ఈ విషయాన్ని తేల్చాలని కోరారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉందన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version