Andhrapradesh
8వ సారి లక్ష ఓట్ల మెజార్టీనే టార్గెట్.. కుప్పంలో చంద్రబాబు పర్యటన సాగిందిలా..
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం లక్ష ఓట్ల మెజారిటీ టార్గెట్‌గా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండ్రోజుల చంద్రబాబు పర్యటన పార్టీ కేడర్‌కు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. నిన్నటి నుంచి కుప్పంలో బిజీబిజీగా గడుపుతున్న చంద్రబాబు.. దేవుళ్ళ ఆశీస్సులు, క్యాడర్ అండదండలు పొందుతూ పర్యటన సాగిస్తున్నారు. నిన్న కుప్పంలోవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు.. ఆ తర్వాత కుప్పం ఎన్టీఆర్ భవన్‌లో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. జలగన్న పాలనలో మద్యం బాటిల్ ధర రూ. 60 నుంచి రూ. 200 అయ్యిందని విమర్శించిన ఆయన.. నాసిరకం మద్యం అమ్ముతూ జగన్ ఆడబిడ్డల మంగళ సూత్రాలను తెంచేస్తున్నారని ఆరోపించారు. ఇక టీడీపీ అధికారంలోకొస్తే నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అందిస్తాని హామీ కూడా ఇచ్చారు. జే బ్రాండ్ ఎందుకు పెట్టారో జగన్ సమాధానం చెప్పాలన్న చంద్రబాబు.. కుప్పంలో వైసీపీ నేతలు రాళ్లు ,మట్టిని సైతం అమ్ముకుంటున్నారని విమర్శించారు. టీడీపీకి ఓటు వేస్తేనే ఇంట్లో మగవాళ్లకు అన్నం పెట్టండని పిలుపునిచ్చారు చంద్రబాబు. కుప్పంకు వస్తే రీఛార్జ్ అవుతానని, 40 ఏళ్లుగా కుప్పం ప్రజలు ఓటేసి గెలిపిస్తున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ రెన్యువల్ చేయమని కోరుతున్నానన్నారు చంద్రబాబు. లక్ష ఓట్ల మెజారిటీతో కుప్పంలో గెలిపించండని ప్రజలను కోరారు.
కుప్పం బహిరంగ సభలోనూ చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. పేదరికమే నా మతమని బలహీనవర్గాలే నా ధైర్యమన్నారాయన. కుప్పం అంటే చంద్రబాబు అని.. కుప్పం ప్రజల ఆశీస్సులు కోసం వచ్చానని తెలిపారు. 8వ సారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండని ప్రజలను కోరారు. ఎన్నికలెప్పుడు జరిగినా కుప్పం ప్రజలు సిద్దంగా ఉన్నారని.. కుప్పం అభివృద్ధికి అడ్డుపడ్డ వైసీపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. కుప్పంలో చిల్లర రాజకీయాలు చేస్తూ కుప్పిగంతలు వేస్తున్న నాయకులకు తాము సిద్దమని పేర్కొన్నారు. పోలీసులకు రెండు పార్టీల నాయకులు ఒక్కటేనని.. పుంగనూరు పుడింగి దోచుకోవడానికే కుప్పం వస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్ళుగా కుప్పంలో దోపిడి జరిగిందని.. కుప్పానికి రానీయకుండా చేసి తనపై కేసులు పెట్టారన్నారు చంద్రబాబు. తనపైనే కుప్పంలో రౌడీయిజం చేశారని.. వందలాది మంది టీడీపీ నాయకులపై కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడియిజం చేస్తున్న రౌడీలకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఎన్నికలలో అక్రమాలు చేస్తే తెలుగు తమ్ముళ్లు అడ్డుపడతారన్నారు చంద్రబాబు. సైకో ముఖ్యమంత్రి హంద్రీనీవానీరు అంటూ హడావిడి చేశారని.. డ్రామాలు, సినిమా సెట్టింగులతో కుప్పం ప్రజలను మోసం చేశారన్నారు చంద్రబాబు. కుప్పం రావడానికి సీఎం సిగ్గు పడాలన్నారు. 90 శాతం హంద్రీనీవా కాలువ పూర్తి చేశానని.. నీరు తీసుకువచ్చి అన్ని చెరువులు నింపుతామన్నారు. పాలారు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. అయితే అవేం జరగలేదని.. కుప్పం ప్రజలకు అన్యాయం చేసారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గ్రానైట్ మాఫియా కుప్పానికి వచ్చిందని కేజీఎఫ్ తరహాలో గ్రానైట్ తవ్వేశారన్నారు. అన్నీ లెక్కలున్నాయని వడ్డీతో సహా తీరుస్తానన్నారు. జైలుకుపోయినా జెండా వదలని సైనికులు టీడీపీ కార్యకర్తలన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ కుప్పంలోనే రావాలన్నారు తెలిపారు.