International

66 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం.. ఆ దేశం తర్వాత మనోళ్లే టాప్

Published

on

అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారని యూఎస్ కాంగ్రెషనల్ తాజా నివేదిక వెల్లడించింది. మొదటి స్థానంలో మెక్సికన్లు ఉన్నట్టు తెలిపింది. 2022లో 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరులైనట్టు పేర్కొంది. అమెరికా జనగణన బ్యూరో ప్రకారం.. 2022 నాటికి ఆ దేశంలోని 33 కోట్ల మంది జనాభాలో విదేశీయులు దాదాపు 14 శాతం (46 మిలియన్ల) మంది ఉన్నారు. వీరిలో 24.5 మిలియన్లు అంటే దాదాపు 53 శాతం మంది అధికారికంగా అమెరికా పౌరులైనట్టు తమ స్థితిని నివేదించారు. 2022 ఆర్థిక సంవత్సరంలో స్వతంత్ర కాంగ్రెషనల్ రిసెర్చ్ సర్వీస్ ఏప్రిల్ 15న వెల్లడించిన ‘యూఎస్ నేచురలైజేషన్ పాలసీ’ నివేదిక ప్రకారం 969,380 మంది విదేశీయులు అమెరికా పౌరులుగా మారారు.

‘మెక్సికోలో జన్మించిన వ్యక్తులు అత్యధిక సంఖ్యలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో భారత్, ఫిలిప్పీన్స్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్ నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు’ అని నివేదిక పేర్కొంది. అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం.. 2022లో 128,878 మంది మెక్సికన్లు అమెరికా పౌరులుగా మారారని CRS తెలిపింది. వారి తర్వాతి భారత్ (65,960), ఫిలిప్పీన్స్ (53,413), క్యూబా (46,913), డొమినికన్ రిపబ్లిక్ (34,525), వియత్నాం (33,246), చైనా (27.038) పౌరులు ఉన్నారు. సీఆర్ఎస్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం అమెరికాలోని విదేశీయుల్లో భారతీయులది రెండో స్థానం ( 2,831,330 మంది) కాగా.. మొదటి స్థానంలో మెక్సికన్లు (10,638,429) ఉన్నారు. వీరి తర్వాతి స్థానంలో చైనీయులు (2,225,447) ఉండటం గమనార్హం.

అయితే, అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో 42 శాతం మంది అమెరికా పౌరసత్వానికి అనర్హులని CRS నివేదిక పేర్కొంది. 2023 నాటికి గ్రీన్ కార్డ్ లేదా లీగల్ పర్మనెంట్ రెసిడెన్సీ (LPR)లో ఉన్న 2,90,000 మంది భారతీయలు మాత్రమే అర్హులని తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో పౌరసత్వ దరఖాస్తుల్లో USCIS ప్రాసెసింగ్ బ్యాక్‌లాగ్‌లపై కొంతమంది పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు సీఆర్సీ పేర్కొంది. అయితే, దరఖాస్తుల పరిశీలనలో జాప్యం కొనసాగుతున్నప్పటికీ, 2020 ఆర్ధిక సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్యను సగానికి పైగా తగ్గించింది.

2023 ఆర్ధిక సంవత్సరం చివరి నాటికి.. USCIS వద్ద సుమారు 408,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2020లో 943,000 దరఖాస్తు ఉండగా.. 2021 చివరి నాటికి 840,000కి.. 2022 చివరి నాటికి 550,000 లకు తగ్గించింది. గత ఆర్దిక సంవత్సరంలో 823,702 LPRలు పౌరసత్వం కోసం దరఖాస్తులను సమర్పించారు. ఇటీవల పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సంఖ్య 2023లో అర్హత పొందిన 9 మిలియన్ల LPRల కంటే తక్కువగానే ఉంది. పౌరసత్వం పొందిన విదేశీయుల శాతం.. దేశం మూలం సహా అనేక అంశాల ఆధారంగా మారుతూ ఉంటుంది. సహజంగా వలస వచ్చిన విదేశీయుల్లో హోండురాస్, గ్వాటెమాలా, వెనిజులా, మెక్సికో, ఎల్ సాల్వడార్, బ్రెజిల్‌లో జన్మించినవారు అతి తక్కువ శాతం.. వియత్నాం, ఫిలిప్పీన్స్, రష్యా, జమైకా, పాకిస్థాన్ నుంచి వచ్చినవారు అత్యధికంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version