National

3కోట్ల కుటుంబాలకు త్వరలో కొత్త ఇళ్లు- తొలి రోజే మోదీ కేబినెట్​ కీలక నిర్ణయం – central cabinet decisions today

Published

on

Central Cabinet Decisions Today : ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద దేశంలో కొత్తగా 3 కోట్లు ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే దిల్లీ లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లోని తన నివాసంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారి కోసం మొత్తం 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత పదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 4కోట్ల 21లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. వాటికి ప్రాథమిక మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

కేబినెట్‌ భేటీకి ముందు పీఎంవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి కార్యాలయం ప్రజల కోసమే పనిచేయాలని చెప్పారు. సమయంతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తించాలని అక్కడి అధికారులకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ప్రధానమంత్రి కార్యాలయం అంటే అధికార కేంద్రంగా ఉంటుందనే ప్రచారం ఉందని తెలిపారు. కానీ ప్రజాసేవకే అధిక ప్రాధాన్యం ఉండాలని మోదీ స్పష్టం చేశారు. తన జీవితంలో ప్రతీ క్షణం ప్రజల కోసమేనని పేర్కొన్నారు. దేశమే ప్రప్రథమం, 2047నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వివరించారు. ఆయా లక్ష్యాల సాధనకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. జీవితంలో విజయం సాధించాలంటే నిరంతర విద్యార్థిలా ఉండాలని ఈ సందర్భంగా అధికారులకు ప్రధాని సూచించారు.


“ఎన్నికల్లో విజయం మోదీ మాటల వల్ల రాలేదు. గత పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేసిన శ్రమకు ఫలితం. ఈ విజయానికి ఎవరైనా హక్కుదారులు ఉన్నారంటే వారు దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే. మీరంతా ఒక విజన్‌ కోసం అంకితభావంతో పని చేశారు. ఫలితంగానే గతంలో కంటే చాలా వేగంగా అభివృద్ధి జరిగింది. వాటి ఫలితాలు కనిపిస్తున్నాయి. నేను మరింత ఉత్సాహంతో, శక్తితో ముందుకు సాగాలని కోరుతున్నాను. నేను విశ్రాంతి తీసుకోవడానికి పుట్టలేదు. ఏ వ్యక్తి అయినా తనలోని విద్యార్థి నిరంతరం బతికి ఉండేలా చూస్తేనే విజయవంతం అవుతారు. నాలో శక్తికి అసలు రహస్యం జీవితం అంతా నిత్య విద్యార్థిలా ఉండడమే. తనలోని విద్యార్థిని సజీవంగా ఉంచే వారెవరూ ఎప్పుడూ బలహీనంగా ఉండరు. ఎప్పటికీ అలిసిపోరు. ప్రతీక్షణం నూతనోత్సాహంతో ముందుకెళుతూ ఉంటారు.”
–నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

Advertisement

అంతకుముందు సోమవారం ఉదయం మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, రైతులకు సంబంధించి పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందనుంది.

మోదీకి పాక్​ ప్రధాని శుభాకాంక్షలు
మరోవైపు భారత ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నరేంద్ర మోదీకి పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. షెహబాజ్‌ షరీఫ్‌ పోస్టుపై స్పందించిన ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏడు పొరుగు దేశాలను ఆహ్వానించినప్పటికీ పాకిస్థాన్‌కు మాత్రం భారత్‌ ఆహ్వానం పంపలేదు. దీంతో దాయాది దేశం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌-పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్‌ మానుకునే వరకు ఇరుదేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవని భారత్‌ పదే పదే స్పష్టం చేస్తూ వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version