National
17 నెలల తర్వాత.. జైలు నుంచి విడుదలైన సిసోడియా..
తిహార్ జైలు నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విడుదలయ్యారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. 17 నెలలు (530 రోజుల) పాటు తిహార్ జైలులో సిసోడియా ఉన్నారు.
పాస్ పోర్ట్ సరెండర్, 10 లక్షల రూపాయల పూచికత్తు, ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరుకవాలని షరతులు విధించింది సుప్రీంకోర్టు. దీంతో సిసోడియా విడుదల కావడంతో తిహార్ జైలు వద్ద ఆప్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సిసోడియాకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్వాగతం పలికారు.
రానున్న రోజుల్లో నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సిసోడియా చెప్పుకొచ్చారు. రాజ్యాంగ బలం, నిజంతోనే తాను బయటకు వచ్చానని తెలిపారు. విపక్ష నేతలను రాజ్యాంగం కాపాడుతుందని అన్నారు. సిసోడియా శనివారం రాజ్ ఘాట్‌ను సందర్శించనున్నారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 17 నెలల క్రితం మనీష్ సిసోడియా అరెస్టు అయిన తర్వాత ఇప్పటివరకు ఇదే కేసులో మరికొంత మంది కూడా అరెస్టు చేశారు.