International
14ఏళ్ల తర్వాత అసాంజేకు విముక్తి- సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం
Assange Plea Deal : దాదాపు 14ఏళ్ల న్యాయపోరాటం తర్వాత వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు విముక్తి లభించింది. అమెరికా సైనిక రహస్యాలను ప్రచురించటం ద్వారా గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్‌లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని ఉత్తర మారియానా ద్వీపం రాజధాని సైపన్ కోర్టు తీర్పునిచ్చింది. అంతకుముందు అమెరికా న్యాయవిభాగంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తిచేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే ఇదంతా చేసినట్లు పేర్కొన్న అసాంజే, అది గూఢచర్య చట్టానికి విరుద్ధమని అంగీకరించారు. అసాంజే నేరాంగీకారానికి యూఎస్ డిస్ట్రిక్ట్ చీఫ్ జడ్జి జస్టిస్ రమొనా వి.మంగ్లోనా ఆమోదించారు. ఇప్పటికే బ్రిటన్‌లో గడిపిన నిర్బంధ కాలాన్ని శిక్షగా పరిగణిస్తూ అసాంజేను విడుదల చేయాలని తీర్పునిచ్చారు. ఈనేపథ్యంలో జైలు నుంచి విడుదలైన అసాంజే ప్రత్యేక విమానంలో తన సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.