International
12లక్షల పదాలు, 4వేల పేజీలు- ప్రపంచంలోనే లాంగెస్ట్ బుక్ ఇదే! – World Longest Book
Longest Book in the World : పుస్తకం చదవడం అంటే చాలా మందికి ఇష్టం. ఈ కంప్యూటర్ యుగంలో మనం ఎంతగా అప్డేట్ అయినా, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో ఈ-బుక్‌లు చదువుతున్నా, పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చదవడంలో ఉన్న ఆనందమే వేరు!! ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పుస్తకం గురించి తెలుసుకోబోతున్నాం. పదాల సంఖ్య, పేజీల సంఖ్య లెక్క ఆధారంగా ఒక పుస్తకానికి ఈ రికార్డు దక్కుతుంది. దాని పేరే ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’. ఈ నవలను ఒరిజినల్‌గా ఫ్రెంచ్ భాషలో రచయిత మార్సెల్ ప్రౌస్ట్ రచించారు. ఫ్రెంచ్ భాషలో ఈ పుస్తకం పేరు ‘అ లా రీచెర్చే డు టెంప్స్ పెర్డు’. ఈ పుస్తకం 1913 నుంచి 1930వ దశకం వరకు 7 వాల్యూమ్‌లలో పబ్లిష్ అయింది. 1922లో రచయిత మార్సెల్ ప్రౌస్ట్ చనిపోయారు. ఆయన మరణించాక కొన్ని వాల్యూమ్స్ ప్రచురితమయ్యాయి.
పబ్లిష్ చేసేందుకు నో చెప్పారు!
ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్ అనేది ఒక ఫిక్షన్ పుస్తకం. రచయిత మార్సెల్ ప్రౌస్ట్ బాల్యం నుంచి ముసలితనం వరకు తన గత జీవిత జ్ఞాపకాలను ఒక్కో వాల్యూమ్‌లో చక్కగా సులభమైన ఫ్రెంచ్ భాషలో చెప్పుకొచ్చారు. తర్వాత కాలంలో ఈ పుస్తకం ఆంగ్లంలోకి అనువాదమైంది. ఈ పుస్తకంలోని పేజీలు ఎక్కువగా ఉండటం వల్ల పబ్లిష్ చేసేందుకు చాలా ప్రచురణ సంస్థలు తొలుత రచయిత మార్సెల్ ప్రౌస్ట్‌కు నో చెప్పాయి. ఎట్టకేలకు 1913లో ఓ ప్రచురణ సంస్థ మార్సెల్ ప్రౌస్ట్ పుస్తకంలోని మొదటి వాల్యూమ్‌ను ‘స్వాన్స్ వే’ టైటిల్‌తో పబ్లిష్ చేసింది.
మొత్తంగా ఏడు వాల్యూమ్‌లతో కూడిన ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’ పుస్తకాన్ని ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పుస్తకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఇందులో దాదాపు 12 లక్షల పదాలు, 4వేల పేజీలు ఉన్నాయని అంటారు. నేటికీ ఫ్రెంచ్ సాహిత్యంపై, ప్రాచీన నవలలపై అధ్యయనం చేసే వారు ఈ పుస్తకాన్ని తప్పకుండా చదువుతుంటారు. ప్రతిపదం, దాని పక్కనున్న ఖాళీ స్థలాన్ని కూడా కలుపుకొని క్యారెక్టర్ అంటారు. ‘ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్’ బుక్‌లో ఇలాంటి 96.09 లక్షల క్యారెక్టర్లు ఉన్నాయట. అందుకే దీనికి ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైన బుక్‌గా గుర్తింపు దక్కింది.
ఒకే వాల్యూమ్‌లో అతి సుదీర్ఘమైన పుస్తకం ఏది?
ఒకే వాల్యూమ్‌లో అతి సుదీర్ఘమైన పుస్తకం ఏది? అంటే ఆస్ట్రేలియన్ రచయిత జేవియర్ హెర్బర్ట్ రచించిన ‘పూర్ ఫెలో మై కంట్రీ’!! సింగిల్ వాల్యూమ్‌లో ఉండే ఈ బుక్‌లో 12 లక్షల పదాలు ఉన్నాయి. 1975లో ఇది పబ్లిష్ అయింది. దీనిలో 1,463 పేజీలు ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభ కాలానికి సంబంధించిన ఆస్ట్రేలియా సమాజం, సంస్కృతి గురించి ఇందులో అద్భుతంగా చెప్పారు.
ది లాంగెస్ట్ ఎన్‌సైక్లోపీడియా ఏది?
ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైన ఎన్‌సైక్లోపీడియా ఏది? అంటే చైనాలోని మింగ్ రాజవంశానికి చెందిన యోంగిల్ చక్రవర్తి ఒక ఎన్‌సైక్లోపీడియాను తయారు చేయించారు. దాని పేరు ‘ది యోంగిల్ ఎన్‌సైక్లోపీడియా’. దీన్నే ‘యోంగిల్ డాడియన్’ అని కూడా పిలుస్తుంటారు. ఇది 15వ శతాబ్దం ప్రారంభ కాలం నాటి చైనా చరిత్ర, మానవ జీవితం వివరాలను తెలియజేస్తుంది. ఇది 11,000 కంటే ఎక్కువ వాల్యూమ్‌లలో, దాదాపు 37 కోట్ల చైనీస్ అక్షరాలతో, 22,000 కంటే ఎక్కువ అధ్యాయాలతో ఉంటుంది. ఇది మానవ చరిత్రలో ఇప్పటివరకు సంకలనం చేయబడిన అతిపెద్ద ఎన్‌సైక్లోపీడియా.