Andhrapradesh
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
10 వేల మందితో భద్రతా ఏర్పాట్లు
భద్రతా వలయంలో విజయవాడ-గన్నవరం
(గన్నవరం): రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
10 వేల మంది భద్రతా బలగాలతో పటిష్ట బందోబస్తు నెలకొల్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రానున్నారు. ఆయనతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమిత్ షా మంగళవారం రాత్రికే విజయవాడ చేరుకున్నారు.
కాగా.. ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు బుధవారం ఉదయం రాష్ట్రానికి రానున్నారు. ప్రధాన మంత్రి మోదీ పర్యటనకు భద్రత కల్చించేందుకు ప్రత్యేక భద్రతా విభాగం (ఎస్పీజీ) బలగాలు రెండు రోజుల క్రితమే రాష్ట్రానికి చేరుకున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో సభా ప్రాంగణాన్ని ఇప్పటికే తమ ఆ«దీనంలోకి తీసుకున్నాయి. మరో 10 వేల మంది పోలీసు బలగాలను ప్రధాన మంత్రి పర్యటన కోసం వినియోగిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలోని కేసరపల్లి వరకు 22 కి.మీ. వరకు దారి పొడవునా ఇరువైపులా భద్రతా బలగాలు మోహరించాయి.
గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లోనూ బలగాలు నిఘాను పటిష్టపరిచాయి. కేసరపల్లి ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. డ్రోన్లు గానీ బెలూన్లు గానీ ఎగుర వేయకూడదని స్పష్టం చేశారు. కోల్‌కత్తా-చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అధికారిక పాస్‌లు ఉన్న వాహనాలు మినహా.. ఇతర వాహనాలను ఆ మార్గంలో అనుమతించబోమని ప్రకటించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంగా భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, అదనపు డీజీ శంకభాత్ర బాగ్చీ, విజయవాడ పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ, ఏలూరు, గుంటూరు ఐజీలు అశోక్‌కుమార్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఎస్పీజీ ఐజీ సమీక్ష
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎస్పీజీ ఐజీ నవనీత్‌కుమార్ మెహతా అధికారులకు సూచించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మంగళవారం భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ముందస్తు భద్రత సమన్వయం (ఏఎస్‌ఎల్) నిర్వహించారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ నుండి ప్రమాణ స్వీకార వేదిక వరకు పీఎం కాన్వాయ్ ట్రయిల్‌రన్ నిర్వహించారు. తొలుత పీఎం కాన్వాయ్ రాకపోకలకు సంబంధించి రూట్‌మ్యాప్‌పై అధికారులతో మెహతా చర్చించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, డీఐజీ గోపీనాథ్‌జెట్టి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మీ, అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుహసిని పాల్గొన్నారు.