Andhrapradesh

ప్రధాని అభ్యర్థిని ఎన్నుకున్న బీజేపీ: జాతీయ కార్యవర్గ భేటీలో..

Published

on

BJP National council meeting: లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించి ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో భారతీయ జనత పార్టీ.. కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.
ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించడానికి అవసరమైన అజెండాను ఖరారు చేస్తోంది.

దేశ రాజధానిలోని భారత్ మండప్ వేదికగా జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల కార్యదర్శులు, పదాధికారులు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్ర శాఖ అధ్యక్షులు హాజరయ్యారు.

రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సన్మానించారు బీజేపీ నేతలు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా.. ఆయనకు నిలువెత్తు పూలమాలను వేసి సత్కరించారు. మోదీజీకి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. మోదీని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినట్టయింది.

అనంతరం అమిత్ షా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో 400 లోక్‌సభ స్థానాలను గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని, దీన్ని అవలీలగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ముచ్చటగా మూడోసారి ఆయన ఈ దేశానికి నాయకత్వాన్ని వహిస్తారని చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవని వ్యాఖ్యానించారు.

ఈ 75 సంవత్సరాల్లో ఈ దేశం 17 లోక్‌సభ ఎన్నికలు, 22 ప్రభుత్వాలు, 15 మంది ప్రధానమంత్రులను చూసిందని, ఎప్పుడూ జరగని అభివృద్ధి మాత్రం మోదీ హయాంలోనే చోటు చేసుకుందని అమిత్ షా అన్నారు. ప్రతి రంగం అభివృద్ధి చెందిందని, ప్రతి వ్యక్తి అవసరాలను మోదీ ప్రభుత్వం తీర్చిందని చెప్పారు. ఈ 10 సంవత్సరాలలో మాత్రమే అది సాధ్యపడిందని స్పష్టం చేశారు.

Advertisement

ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా.. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసిందని ఆరోపించారు అమిత్ షా. అత్యంత అవినీతికరమైన కుటుంబ పాలనను ఈ దేశానికి అందించిందని విమర్శించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపులు, కులతత్వంతో ఇన్ని సంవత్సరాల పాటు పాలించారని ధ్వజమెత్తారు. దీన్ని నిర్మూలించి.. ఈ 10 సంవత్సరాలలో మోదీ ఎంతో అభివృద్ధిని సాధించారని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version