Hyderabad
ఏపీలో చంద్రబాబు వస్తే హైదరాబాదుకు వచ్చిన నష్టం ఏమీ లేదు… పొంగులేటి
హైదరాబాద్: పక్క రాష్ట్రంలో ఏదో జరగబోతుందనో, దేశంలో ఎక్కడో ఏదో జరిగిందనో.. హైదరాబాద్‌కు వచ్చిన నష్టమేమీ లేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, ఇతరత్రా వసతుల దృష్ట్యా హైదరాబాద్ నగరం దేశంలోనే బెస్ట్ ప్లేస్ అని ఆయన స్పష్టం చేశారు. ఇది తాను చెబుతున్న మాట కాదని, మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధులు చెప్పిన మాట అని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని, హైదరాబాద్‌కు ఏదో నష్టం జరగబోతోందనే వార్తలు కరెక్ట్ కాదని మంత్రి పొంగులేటి అన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పారు. ఎందుకంటే ఈ నగరానికి ఉన్న భౌగోళిక వనరులు, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలే అందుక్కారణమని తెలిపారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల కంటే హైదరాబాద్ ఉత్తమమని పలు సంస్థల ప్రతినిధులే చెప్పారని మంత్రి గుర్తుచేశారు.